A Young Man Arrested for cheating Young Women in Hyderabad : పెళ్లి పందిళ్లలో 'ఆపండి..' అనే డైలాగ్ మనం ఎన్నో సినిమాల్లో చూసుంటాం.. విని ఉంటాం. సరిగ్గా వరుడు.. వధువు మెడలో తాళి కడుతుండగా.. ఎవరో ఒకరు వచ్చి 'ఆపండి.. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు' అనడం మామూలే. అచ్చం అలాంటి సీనే నిజ జీవితంలో జరిగింది. కాకపోతే ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుండగా.. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఉంగరాలు మార్చుకుంటుండగా.. 'యు ఆర్ అండర్ అరెస్ట్' అంటూ వరుడికి షాక్ ఇచ్చారు. ఏపీలోని కడప జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ఒడిశా టూ ఏపీ.. వయా పోలీసు స్టేషన్!
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా రాయచోటికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అలియాస్ బాషా (25) హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. బంజారాహిల్స్‌లోని ఓ చిల్డ్రన్స్ హాస్పిటల్ క్యాంటీన్లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే పని చేసే ఓ యువతితో ఏర్పడిన పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాషా.. రహమత్‌నగర్ పరిధిలోని జవహర్ నగర్లో ఓ గది అద్దెకు తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడు. ఏడాది క్రితం మరో ఆసుపత్రికి బదిలీ అయ్యాడు. అక్కడ మరో యువతిని లొంగదీసుకుని.. ఈసారి కార్ఖానా ప్రాంతంలో రూమ్ రెంట్‌కు తీసుకుని సహజీవనం ప్రారంభించాడు.
ఇతడిని ప్రేమించింది.. అతడిని పెళ్లి చేసుకుంది.. చివరికి ఎటూ కాక..!
ఇంతకాలం ఏదో ఒకటి చెప్తూ మొదటి యువతిని మేనేజ్ చేస్తూ వచ్చిన బాషా.. ఈ నెల 6 నుంచి ఆమె ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదు. దీంతో ఆ యువతి మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. తాజాగా రెండో యువతిని సైతం బాషా దూరం పెట్టడంతో అతడి గురించి యువతి ఆరా తీసింది. ఈ క్రమంలో మధురానగర్ పీఎస్‌లో మొదటి యువతి పెట్టిన కేసు గురించి తెలుసుకుంది. జవహర్‌నగర్ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కడప జిల్లా రాయచోటిలోని ఓ ఆర్టీసీ ఉద్యోగి కుమార్తెతో బాషా ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలుసుకున్న ఎస్సై ఇక్బాల్.. అక్కడికి చేరుకుని నిశ్చితార్థం ఆపించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు.
Jabardasth Comedian Arrested : ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్
పోలీసులు నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాక.. అసలు కథ మొదలైంది. ప్రేమ పేరు చెప్పి తననూ మోసగించాడంటూ కార్ఖానా (రెండో) యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే నిందితుడిపై మొదట కేసు తానే పెట్టినందున తననే పెళ్లి చేసుకోవాలని జవహర్‌నగర్ యువతి పట్టుబట్టింది. మొదటగా ప్రేమించింది తననేనని.. తననే వివాహం చేసుకోవాలంటూ రెండో యువతి బీష్మించుకు కూర్చుంది. ఒకానొక దశలో ఇద్దరు యువతులు వాగ్వివాదానికి దిగారు. చివరకు పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి.. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ఇద్దరు యువతులతో పాటు ఇంకెవరినైనా ప్రేమ పేరుతో మోసం చేశాడా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.
Wife Kills Husband With Her Boyfriend : మన బంధానికి మా ఆయనే అడ్డు.. అతన్ని చంపేసెయ్!