హైదరాబాద్లోని మాదాపూర్‌లో దుర్గంచెరువుపై నిర్మించిన తీగల వంతెన ఆ ప్రాంతానికి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. చెరువుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలను కలుపుతూ దూరాన్ని దగ్గర చేస్తోంది. ఎత్తైన గుట్టల మధ్య సాగే ఈ నిర్మాణం నగరానికి కొత్త చిహ్నంలా మారుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ.184 కోట్ల అంచనా వ్యయంతో రెండేళ్ల కిందట మొదలైన పనులు ఇటీవల పూర్తయ్యాయి. విద్యుద్దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి. దీని పొడవు 754.83 మీటర్లు. ఆరులైన్ల వెడల్పుతో రోడ్డు మార్గం ఉంటుంది. ఇరువైపులా ఆకట్టుకునే కాలిబాట, ఉక్కు రెయిలింగ్, విద్యుద్దీపాలు నిర్మాణానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయని ఎస్‌ఈ వెంకటరమణ తెలిపారు.
కొనసాగింపుగా నిర్మాణమవుతున్న జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45 పైవంతెన నిర్మాణం పూర్తవగానే తీగల వంతెన అందుబాటులోకి వస్తుందంటున్నారు. జులై నెలాఖరుకు అందుబాటులోకి తేవాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ లక్ష్యం నిర్దేశించినట్లు వెల్లడించారు.