ఉదయం నిద్రలేచింది మొదలు మళ్లీ నిదురించేంత వరకు కళ్లకు పని చెబుతూనే ఉంటాం. పుస్తకాలు చదివినా, టీవీ చూసినా, ఆఫీసులో కంప్యూటర్ ముందు పనిచేసినా... కళ్లు నిరంతరం శ్రమిస్తూ ఉంటాయి. అలాంటి అతి ముఖ్యమైన నయనాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...
- గింజలు... వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అలాగే వీటిల్లో ఉండే విటమిన్-ఇ వయసు పైబడటం వల్ల వచ్చే కంటి సమస్యల నుంచి కాపాడుతుంది. జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్, వేరుసెనగపప్పు, ఇంకా కొన్ని రకాల పప్పుల్లో ఇది ఉంటుంది.
- విత్తనాలు... విత్తనాల్లో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటుగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లూ ఉంటాయి. సబ్జా, అవసెగింజల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి.
- ఆకుకూరలు... వీటిల్లో ఉండే ల్యుటిన్, గ్జియాంతిన్ వయసు పైబడటం వల్ల వచ్చే కంటి ఇబ్బందుల నుంచి కాపాడతాయి. కంటి ఆరోగ్యానికి ఉపకరించే విటమిన్-ఎ ఉంటుంది. అంతేకాదు విటమన్-సి, కె, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తినీ పెంచుతాయి.
- క్యారెట్లు... వీటిల్లో విటమిన్-ఎ, బీటాకెరోటిన్ అధికంగా ఉంటాయి. బీటాకెరోటిన్ సాయంతో శరీరం విటమిన్-ఎను తయారుచేసుకుంటుంది. క్యారెట్లను ఎక్కువగా తీసుకోవడం ద్వారా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్ఛు
- గుడ్లు... వీటిల్లో ఉండే ల్యుటిన్, గ్జియాంతిన్ వయసు పైబడటం వల్ల తలెత్తే కంటి ఇబ్బందులను నివారిస్తాయి. గుడ్లలో విటమిన్-సి, ఇ, జింక్ కూడా ఉంటాయి.
- చేపలు... దాదాపుగా అన్నిరకాల చేపల్లోనూ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ట్యూనా, సాల్మన్ శరీర కణజాలంలో నూనె ఎక్కువగా ఉంటుంది. వీటిని విరివిగా తీసుకోవడం వల్ల కళ్లు తేమను కోల్పోకుండా ఉంటాయి.
ఈ ఆహారాన్ని తీసుకుంటూ తగినన్ని నీళ్లు తాగడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు