Telangana Budget Sessions 2023-24 : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ ఉభయసభల్లో చర్చ జరగనుంది. శాసనసభ, శాసనమండలి ఉదయం 10 గంటలకు సమావేశం అవుతాయి. రెండు సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తలను రద్దు చేశారు. దీంతో నేరుగా చర్చ చేపడతారు. రెండు సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడతారు.
Governor speech in Telangana Budget Sessions 2023-24 : అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా.. మరో శాసనసభ్యుడు వివేకానందగౌడ్ బలపరుస్తారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించునుండగా... మరో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరుస్తారు. ఆ తర్వాత అన్ని పక్షాలు చర్చలో పాల్గొంటాయి. అనంతరం చర్చకు ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. బీఏసీ సమావేశ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు. పలు సంస్థల వార్షిక నివేదికలను సంబంధిత శాఖల మంత్రులు సభ ముందు ఉంచనున్నారు.
గవర్నర్ ప్రసంగం సాగిందిలా.. శుక్రవారం రోజున తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో దాదాపు రెండేళ్ల తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ప్రతి రంగంలోనూ ఆశ్చర్యపోయే విధంగా సమ్మిళిత సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ యావత్‌దేశానికి ఆదర్శంగా నిలిచిందని తమిళిసై కొనియాడారు.
ప్రభుత్వంపై ప్రశంసల జల్లు.. ‘అగాథమైన పరిస్థితి నుంచి పురోగమించేందుకు ప్రభుత్వం అనేక సవాళ్లను దీటుగా ఎదుర్కొంది. అస్పష్టతలను, అవరోధాలను అధిగమించింది. ఎనిమిదిన్నరేళ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణ అద్భుత విజయాలను సాధించింది’ అని గవర్నర్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనా దక్షత, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం, ప్రజల ఆశీస్సుల వల్లనే తెలంగాణ అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా, సంక్షేమం, అభ్యున్నతిలో అగ్రగామిగా రూపుదిద్దుకుందని ఆమె వివరించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిని రెట్టింపు చేయడంతో పాటు పెట్టుబడులను అధికం చేసిందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి నమూనాపై దేశమంతటా చర్చ నడుస్తోందని అన్నారు.
6న బడ్జెట్.. 8నుంచి చర్చలు.. ఇవాళ గవర్నర్ తీర్మానం తర్వాత ఎల్లుండి (ఈనెల6న) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 8 నుంచి శాసనసభలో బడ్జెట్‌పై చర్చలు జరపనున్నారు. బడ్జెట్, పద్దులపై చర్చ, ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ అనంతరం అవసరమైతే మిగిలిన అంశాలపై చర్చ చేపట్టాలని శాసనసభా వ్యవహారాల సలహా సంఘం నిర్ణయించింది. సమస్యలు, చర్చించాల్సిన అంశాలు అధికంగా ఉన్నందున బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని భట్టి విక్రమార్క కోరారు. కనీసం 25 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని అన్నారు. అన్ని అంశాలపై చర్చిద్దామన్న మంత్రులు.. బడ్జెట్‌పై, పద్దులపై చర్చ, ద్రవ్యవినిమియ బిల్లు అనంతరం అవసరం అనుకుంటే మిగిలిన అంశాలపై చర్చిద్దామని తెలిపారు.