25Years of Vijayashanti Political Journey: సైద్దాంతిక భావాలుండి పార్టీని వీడిన వారంతా తిరిగి బీజేపీలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. అందరం కలిసి కేసీఆర్ నియంత పాలనపై పోరాడుదామన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామని పిలుపునిచ్చారు. సినీ నటి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, పార్టీ రాష్ట్ర కార్యాయలంలో 25 ఏళ్ల రాజకీయ ప్రయాణం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బండి సంజయ్‌తోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. రాజకీయాల్లో ప్రసంశల కంటే విమర్శలే ఎక్కువగా ఉంటాయన్న బండి సంజయ్, విజయశాంతి 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండటం మామూలు విషయం కాదన్నారు. ఆమెకి బీజేపీనే చివరి మజిలీ కావాలని ఆకాంక్షించారు. దేశ రాజధానిలో తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేసింది విజయశాంతి అని కొనియాడారు.
Vijayashanti Political Journey: ఎవరికీ తలవంచకుండా విజయశాంతి పనిచేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆమె బీజేపీలోనే 50 ఏళ్ల ప్రస్తానాన్ని పూర్తి చేసుకోవాలని కోరారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు విజయశాంతి ఎంతో పోరాటం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ వాడుకుని వదిలేసిందన్నారు.
విజయశాంతి మరో పాతికేళ్లు రాజకీయాల్లో కొనసాగాలని ఆకాంక్షించారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి 1998 జనవరి 26న పార్టీలో చేరినట్లు విజయశాంతి తెలిపారు. చిన్నతనం నుంచే తెలంగాణకు ఏదో చెయ్యాలనే ఆకాంక్ష ఉండేదన్నారు. పదవులు ముఖ్యం కాదు.. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు నడిస్తున్నట్లు ఆమె చెప్పారు. సమైక్యాంధ్ర నేతలపై పోరాడితే విజయశాంతి అందరికీ శత్రువు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమైక్యాంధ్ర నేతలు తెలంగాణకు సహకరిస్తే మద్దతు ఉపసంహరించుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేశారని మండిపడ్డారు. తెలంగాణ అంశం వల్ల బీజేపీ ప్రభుత్వం కూలిపోవద్దని పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రకటన రేపు రాబోతుందని తెలుసు.. కేసీఆర్ ముందు రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో అర్థం కాలేదన్నారు.
తప్పుడు మనిషి చేతిలోకి రాష్ట్రం వెళ్లడం బాధ కలిగిందన్నారు. తెలంగాణ పేరుతో వచ్చి కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని దుయ్యబట్టారు. ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల మేలు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.
'మరొక్కసారి కేసీఆర్ అవకాశం ఇచ్చారంటే, ఇంక ఎవరు బతకరు.. తెలంగాణలో అంత భయంకరమైన క్యారెక్టర్. కనబడడు.. ధరణి పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఒక్క నిమిషం ఆలోచించి, రెండు సార్లు అధికారం ఇచ్చి మోసపోయారు'. -విజయశాంతి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు
ఇవీ చదవండి: