పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి గ్రేడింగ్ ద్వారా విద్యార్థులు పైతరగతికి వెళ్లేందుకు అనుమతించాలంటూ.... ఏపీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పరీక్షల విధానంలో మార్పు తెచ్చిన ప్రభుత్వం.... విద్యార్థులు తమ సందేహాల్ని ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకునేందుకు కనీస సమయం ఇవ్వలేదని పిల్‌లో పేర్కొన్నారు. పైగా జులైలోనే పరీక్షలు నిర్వహించబోతున్నారని తెలిపారు. "సొసైటీ ఫర్ బెటర్ లివింగ్" సంస్థ అధ్యక్షుడు టి.భవానీప్రసాద్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లాక్‌డౌన్ వల్ల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారన్న పిటిషనర్.... పరీక్షల విధానంలో మార్పు చేసి నిర్వహించడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన్నారు.
కామన్ గ్రేడింగ్ ఇవ్వాలి
సందేహాలు నివృత్తి చేసుకునేందుకు విద్యార్థులకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో మధ్యప్రదేశ్, పంజాబ్ పదో తరగతి బోర్డులు వ్యవహరించినట్లుగా.... పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు కామన్ గ్రేడింగ్ ఇచ్చి పైతరగతికి పంపేలా వెసులుబాటు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ.... పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
- ఇదీ చూడండి: మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ