జీవితాన్ని నచ్చిన విధంగా మలుచుకోవాలంటే ఎంతో ఓర్పు, నేర్పు కావాలి. అలాంటిది లక్షలాది జీవితాల్ని మార్చాలంటే పట్టుదల, పక్కా ప్రణాళిక, కొండంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. ఇదే నిరూపిస్తూ.. 11 రాష్ట్రాల్లో నిరుపేదల జీవితాల్లో సౌర వెలుగులు నింపుతున్నాడు.. రుస్తుం సేన్ గుప్తా.
బూంద్ సోలార్ కంపెనీని.. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ విద్యార్థైన రుస్తుం సేన్ గుప్తా 2010లో ప్రారంభించాడు. అంతకముందు మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్‌గా ఆరంకెల జీతం అందుకున్న రుస్తుం.. గ్రామీణ ప్రాంత వాసులకు కనీస సదుపాయాల్ని అందించేందుకు సామాజిక వ్యాపారవేత్తగా మారాడు. గ్రామీణ భారత దేశంలో సౌర వెలుగులు నింపే బాధ్యతను తీసుకున్నాడు.
బూంద్.. దశాబ్దాలుగా చీకట్లు కమ్ముకున్న గ్రామాల్లో సౌర వెలుగులు అందించడానికి రుస్తుం రూపకల్పన చేసిన ప్రాజెక్ట్. గ్రామీణ వాసులకు అతితక్కువ ధరకే సౌర విద్యుత్ అందిస్తున్న బూంద్.. సౌర విద్యుత్ వినియోగాన్ని, ఉత్పత్తి పెంచేందుకు పక్కా ప్రణాళికగా ముందుకు సాగుతోంది. చిరు వ్యాపార సంస్థలు, చిన్నతరహా పరిశ్రమలకు సౌర సామగ్రిని.. సరసమైన ధరలకే అందిస్తోంది. నాణ్యమైన ఉత్పత్తులు సహా ఐదేళ్ల నిర్వహణ బాధ్యతల్ని సైతం స్వీకరిస్తూ.. సౌర వెలుగుల్ని విస్తరింపజేస్తోంది.
130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో నేటికి లక్షలాది కుటుంబాలు విద్యుత్ సౌకర్యం లేక చీకటితోనే సావాసం చేస్తున్నాయి. చిన్నారులు నాణ్యమైన విద్యకు దూరంగా ఉంటున్నారు. తాగునీరు, మెరుగైన వైద్య సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటికి బూంద్ పరిష్కారం చూపుతోంది. బూంద్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రుస్తుం.. గ్రామాల్లో మౌళికవసతుల కోసం వినియోగిస్తున్నాడు.
2010లో ప్రారంభమైన బూంద్.. ఇప్పటివరకు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఒడిశా సహా 11 రాష్ట్రాలకు విస్తరించింది. 2 లక్షల మందికి పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. గ్రామాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయటం ద్వారా రుస్తుం.. గ్రామీణ యువతకు ఉపాధి అందిస్తున్నాడు. దాతల సహకారంతో గ్రామాల్లోని నిరుపేదలకు రెండు బల్బులు, సెల్ ఫోన్ ఛార్జింగ్‌కు అవసరమయ్యే విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాడు.
పేదరికం అధికంగా ఉండే ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని వివిధ జిలాల్లో విద్యుత్ సహా తాగునీరు సౌకర్యం, దోమ తెరల్ని బూంద్ అందుబాటులోకి తెచ్చింది. పశ్చిమ్ బంగలో మత్స్య కారులకు తక్కువ వడ్డీకి రుణాలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు సైతం బూంద్ అందిస్తోంది. వ్యాపారాన్ని సొంత లాభాలకు కాకుండా నిరుపేద ప్రజల మెరుగైన జీవనానికి వినియోగిస్తూ రుస్తుం.. వ్యాపారానికే కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. యువ వ్యాపారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇదీ చదవండి: నేడు కంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్