Inter Improvement Exams : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో పాసైన విద్యార్థులు మరిన్ని మార్కులు పెంచుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాసేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తు చేయడమే అందుకు నిదర్శనం. ఇటీవల ఫలితాలు వెల్లడి కాగా.. ఫస్టియర్‌లో 2.69 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో మార్కులు పెంచుకునేందుకు 99,667 (37 శాతం) మంది ఆగస్టు 1వ తేదీ నుంచి జరిగే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేశారు.
కరోనా కారణంగా 2020 నుంచి ఇప్పటి వరకు ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించారు. అయినా ఇంటర్ మార్కులపై విద్యార్థులు రాజీ పడకపోవడం గమనార్హం. మొత్తానికి తప్పిన వారు, మార్కులు పెంచుకునే వారు కలిపి 3,48,171 మంది ఆగస్టు 1 నుంచి పరీక్షలు రాయనున్నారు.
ఇదీ దరఖాస్తుల లెక్క..ఫస్టియర్ సప్లిమెంటరీకి (తప్పినవారు) :1,34,329 మంది
* సెకండియర్ సప్లిమెంటరీకి (తప్పినవారు) : 1,13,267
* ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ : 99,667
* సెకండియర్ ఇంప్రూవ్‌మెంట్ : 15
* ఇతరులు : 893
* మొత్తం : 3,48,171
నేడు 10.30 గంటలకు పాలిసెట్ ఫలితాలు.. పాలిసెట్ ర్యాంకులను ఈరోజు ఉదయం 10.30 గంటలకు విడుదల చేస్తామని కన్వీనర్ డాక్టర్ సి.శ్రీనాథ్ తెలిపారు. జూన్ 30న పరీక్ష జరగగా.. మొత్తం 1.04 లక్షల మంది హాజరయ్యారు.