ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని దాసప్పరోడ్డులో జిల్లేడు మొక్కలపై గురువారం కనిపించిన ఓ మిడతల దండు స్థానికంగా కలవరం రేపింది. ఈ గుంపులో 100-150 మిడతలే ఉన్నా.. మహారాష్ట్రలో ఇప్పటికే పంటలను నాశనం చేస్తున్న పెద్ద మిడతల దండు అనుకుని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత అవన్నీ దేశీయ మిడతలేనని అధికారులు తెలపడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గురువారం సాయంత్రం మిడతల దండుపై అగ్నిమాపక శాఖ అధికారులు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయడం వల్ల అవన్నీ చనిపోయాయి. పెనుకొండలోనూ ఈ తరహా మిడతల జాడ కనిపించింది. వీటి గురించి కీటక శాస్త్రజ్ఞుడు మురళీకృష్ణను వివరణ కోరగా.. ‘అవన్నీ దేశీయ మిడతలు. ఇవి జిల్లేడు మొక్కల ఆకులనే తింటాయి. ఇతర పంటలకు, మానవులకు ఎలాంటి హాని చేయవు' అని వివరించారు.
ఇవీ చదవండి: మహానగర తాగునీటికి కొండంత అండ!