ఏపీలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ... రాజధాని ప్రాంతంలో పూర్ణచంద్రరావు అనే ఎస్సీ రైతు భారీ భవంతులు నిర్మించే క్రేన్ ఎక్కి నిరసన తెలిపారు. నేలపాడు వద్ద నిర్మాణంలో ఉన్న ఎన్జీవో టవర్ వద్ద క్రేన్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని పూర్ణ చంద్రరావు బెదిరించారు.
మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దును గవర్నర్ ఆమోదించటంతో.. గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూర్ణచంద్రరావు వెల్లడించారు. స్థానికులు, పోలీసులు పూర్ణచంద్రరావును కిందకు దించేందుకు సర్ధి చెప్పినప్పటికీ... అతను కిందకు దిగలేదు.
రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఉపాధి కరవైందని పూర్ణచంద్రరావు చెప్పారు. ఇప్పటికే చేసిన అప్పులు తీర్చలేక ఆర్థిక సమస్యలతో తాను ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ తీసుకున్న నిర్ణయం తమ జీవితాలను మరింత అంధకారంలోకి నెట్టిందని.. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూర్ణచంద్రరావు వెల్లడించారు.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే దాకా తాను దిగబోనని పూర్ణచంద్రరావు చెప్పారు. మరోవైపు పోలీసులు అతనిని కిందకు దించేందుకు బంధువులతో మాట్లాడించారు. రాజధాని ప్రాంతంలో రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి దయనీయంగా మారిందని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పూర్ణచంద్రరావు బంధువులు, రాజధాని రైతులు డిమాండ్ చేశారు.