హైదరాబాద్ యూసుఫ్ గూడలోని రహమత్ నగర్ -శ్రీరామ్ నగర్ నివాసి షేక్ నయీముద్దీన్ నాలుగేళ్ల క్రితం సౌదీ అరేబియాలోని జెడ్డాకు ఉపాధి కోసం వెళ్లాడు. నాలుగేళ్లుగా ప్లంబర్‌గా పనిచేసి తర్వాత ఏసీ మెకానిక్‌గా మారాడు. గత నెల 18న ప్రార్థన మందిరంలో నమాజ్ చేస్తూ కింద పడిపోయి చనిపోయాడు. ఇది గమనించి ప్రార్థన మందిరం నిర్వాహకులు అక్కడ పోలీసులకు సమాచారమిచ్చారు. షేక్ నయీముద్దీన్ భౌతిక కాయాన్ని జెడ్డా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకూ హైదరాబాద్‌కు తరలించలేదు.
కుటుంబ సభ్యుల ఆందోళన
నయీముద్దీన్ మృతదేహం స్వస్థలం చేరకపోవడంపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి సంబంధించి అన్ని పత్రాలను సౌదీకి పంపించినా సరైన సమాధానం లేదని నయీముద్దీన్ సోదరుడు షేక్ కరీముద్దీన్ తెలిపారు. భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు పంపలేని పక్షంలో జెడ్డాలోనే ఖననం చేయాలని రాతపూర్వకంగా తమ సమ్మతి పత్రాలను కూడా పంపామని... అయినా సౌదీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి, జోక్యం చేసుకుని తమ సోదరుడి మృతదేహం త్వరగా తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేని పక్షంలో అక్కడ ఖననం చేసిన దృశ్యాలనైనా తమకు పంపాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి : బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం