గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ, ఇతర శాఖల సహకారంతో వాటర్ హార్వెస్టింగ్ డే పురస్కరించుకుని ఇంకుడు గుంతల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. జీహెచ్ఎంసీ, జలమండలితో పాటు నగరంలోని నివాస గృహాల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంకుడు గుంతల పునరుద్ధరణ
మల్కాజిగిరి, కాప్రా, నారాయణగూడ లోని మేల్కొటే పార్క్‌ల్లో ఇంకుడు గుంతల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఎల్బీనగర్ జోన్లో 1326, చార్మినార్ జోన్లో 640, శేర్లింగంపల్లి జోన్లో 2,184, సికింద్రాబాద్ జోన్లో 1,050, కూకట్ పల్లి జోన్లో 1,330, ఖైరతాబాద్‌లో 1,500 ఇంకుడు గుంతల పునర్నిర్మాణాన్ని చేపట్టినట్లు దాన కిశోర్ వెల్లడించారు. మల్కాజిగిరి సర్కిల్ లోని గౌతమ్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో మిస్ ఆసియా పసిఫిక్ సుధా జైన్, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ మమతా త్రివేది, జాతీయ కథక్ నృత్య కళాకారిణి శిల్పా చక్రవర్తి పాల్గొన్నారు.
165 దేశాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి
ప్రపంచంలోని 165 దేశాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలోని కేప్‌టౌన్ నీరులేని ప్రపంచ తొలి నగరంగా నిలిచిందని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి నగరంలో రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ప్రతి కాలనీలో కనీసం రెండు ఇంకుడు గుంతలను నిర్మించాలని అన్నారు.
ఇవీ చూడండి: 'ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి'