రాష్ట్రంలో మార్చి 2న కరోనా వైరస్ తొలి కేసు నమోదు కాగా, 6 వారాల తర్వాత వ్యాధి విజృంభణ ప్రారంభమైంది. మార్చి 30 (ఆరో వారం) నుంచి ఏప్రిల్ 20 (ఎనిమిదో వారం) వరకు కేవలం 3 వారాల వ్యవధిలోనే 822 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు (సోమవారం) మొత్తం 1085 కొవిడ్ కేసులు నిర్ధారణ కాగా, ఇందులో ఆ మూడు వారాల్లోనే 75.56 శాతం కేసులు నమోదు కావడం గమనార్హం.
భారీ పరీక్షలు నిర్వహించడంతోనే..
రాష్ట్రంలో మార్చి 22 నుంచి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలవుతోంది. ఏప్రిల్ తొలివారంలో మర్కజ్ ప్రయాణికుల సమాచారం వెలుగులోకి రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సర్వే నిర్వహించింది. దాదాపు 1345 మంది మర్కజ్ ప్రయాణికులకు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి సుమారు మరో 3193 మందిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో మర్కజ్ ప్రయాణికుల్లో 237 మందిలో, వారి కుటుంబసభ్యులు, సన్నిహితుల్లో 537 మందిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 20 వరకు 3 వారాల్లో పెద్దఎత్తున కేసులు నమోదవడం వెనుక భారీగా పరీక్షలు నిర్వహించడమేనని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి.
ఆ తర్వాత క్రమేణా మర్కజ్ ప్రయాణికుల క్వారంటైన్ గడువు తీరిపోవడం వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోయింది. లాక్‌డౌన్ పక్కాగా అమలవుతుండటం వల్ల గత 2 వారాల్లో 174 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిల్లోనూ గత వారం రోజులుగా అత్యధిక కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అవుతున్నాయి.
ఒక్క కేసు నమోదు కాని 3 జిల్లాలు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదవని జిల్లాల్లో వరంగల్ గ్రామీణ, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాలుండగా.. గత 14 రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాని జిల్లాలు 17 ఉన్నాయి.
585 మంది ఆరోగ్యంగా ఇళ్లకు..
రాష్ట్రంలో సోమవారం మరో ముగ్గురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ ముగ్గురూ జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారే. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 1085కు పెరిగింది. మహమ్మారి కోరల నుంచి కోలుకుని మరో 40 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకు మొత్తం ఆరోగ్యంగా ఇళ్లకెళ్లిన వారి సంఖ్య 585కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 471 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 29 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
ఇదీ చూడండి: ఉత్కంఠ వీడేనా? లాక్‌డౌన్‌పై నేడు మంత్రివర్గ భేటీ