Republic Day Celebrations at Pragathi bhavan: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎంతో పాటు పలువురు మంత్రులు, సీఎస్, డీజీపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటాలకు కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
CM KCR hoists national flag at Pragati Bhavan: అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని అమర జవానుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్, మల్లారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బీఆర్కే భవన్‌లో సీఎస్..: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సచివాలయ కార్యకాలాపాలు జరుగుతున్న బీఆర్కే భవన్‌లో సీఎస్ జాతీయ జెండా ఎగురవేశారు. ఉన్నతాధికారులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు.
శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ ప్రాంగణంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిలు మువ్వనెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, కార్యకర్తలు పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోనూ..: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్.. డిప్యూటీ మేయర్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్న లోకేశ్‌కుమార్.. బడుగు బలహీన వర్గాలకు సమానత్వం లభించేలా రాజ్యాంగ నిర్మాతలు కృషి చేశారని కొనియాడారు. అనంతరం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులు, కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరించారు.
ఇవీ చూడండి..
దిల్లీలో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. జెండా ఎగురవేసిన ముర్ము.. హాజరైన ప్రధాని మోదీ
శ్రీనగర్ లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై రెపరెపలాడిన జాతీయ జెండా.. 30 ఏళ్లలో రెండో సారి..