కొవిడ్ మహమ్మారితో రాజ్‌భవన్ ఉలిక్కిపడింది. అక్కడ 48 మందికి కరోనా సోకింది. వారిలో 28 మంది భద్రతా సిబ్బంది, మరో పది మంది ఇతర సిబ్బందితో పాటు మరో పది మంది వారి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. పాజిటివ్ వచ్చిన 28 మంది పోలీసులను వెంటనే ఐసోలేషన్‌కు తరలించారు. మిగిలిన 20 మందిని ఎస్ఆర్నగర్లోని ఆయుర్వేద ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరికొందరిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. మొత్తం 395 మందిని పరీక్షించగా... 347 మందికి నెగెటివ్ వచ్చింది.
గవర్నర్ దంపతులకు నెగిటివ్..
రాజ్‌భవన్ సిబ్బందితో పాటు గవర్నర్ వారి కుటుంబసభ్యులు పరీక్షలు చేయించుకున్నారు. గవర్నర్ దంపతులకు నెగిటివ్ వచ్చినట్లు రాజ్‌భవన్ వర్గాలు ధ్రువీకరించాయి. రెడ్‌జోన్‌లో ఉన్నవారు, కరోనా పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ కలిగినవారు తప్పక కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రజలకు సూచించారు.
నాలుగు "టి"లు అనుసరించండి
త్వరగా పరీక్షలు చేయించుకోవడం వల్ల... వ్యక్తిగతంగా ఊరట లభించడమే కాకుండా... ఇతరులకు మేలు చేసినవారవుతారని పేర్కొన్నారు. పరీక్షలు చేయించుకోడానికి ఏ మాత్రం సంకోచించకుండా తక్షణమే చేయించుకుని, ఇతరులను ప్రోత్సహించాలని సూచించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు టెస్ట్, ట్రేస్, ట్రీట్, టీచ్ అన్న నాలుగు టీలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.