Loan For Telangana Irrigation Projects : బ్యాంకుల నుంచి రుణాలు అందక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభావం పడటంతో కొత్త అప్పుల కోసం నీటిపారుదల శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్ అండ్ సెక్యూరిటీస్ నుంచి రూ.4,300 కోట్ల రుణం కోసం ప్రయత్నించగా.. ఆ సంస్థ అంగీకరించింది. దీనిపై త్వరలోనే ఒప్పందం కుదరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Telangana Irrigation Projects : మరోవైపు శ్రీరామసాగర్ వరద కాలువ, దేవాదుల కోసం తీసుకున్న రుణం తిరిగి చెల్లింపు ప్రక్రియ ఈ నెల నుంచే ప్రారంభం కానుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రుణం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయగా.. దేవాదుల, శ్రీరామసాగర్ వరదకాలువ, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్ ప్రాజెక్టులకు తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీ) ద్వారా రుణం తీసుకున్నారు.
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ)తో పాటు పలు బ్యాంకుల నుంచి రూ.12,500 కోట్లకు పైగా రుణం తీసుకోగా.. ఇందులో బ్యాంకులు రూ.8 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ కింద రూ.4,500 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు సుమారు రూ.6 వేల కోట్లకు పైగా ఇవ్వగా, దీనికి తగ్గట్టుగా మార్జిన్ మనీ విడుదల కాలేదు. దీంతో బ్యాంకులు ఇవ్వాల్సిన మొత్తం కంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తం రెట్టింపైంది.
మళ్లీ ఒప్పందం చేసుకోగా.. తాజా అంచనాల ప్రకారం అవసరమైన రూ.7 వేల కోట్లలో 33 శాతం బ్యాంకులు, 67 శాతం రాష్ట్ర ఖజానా నుంచి మార్జిన్ మనీ ఇవ్వాల్సి ఉంది. వివిధ బ్యాంకులు రూ.2,700 కోట్లు ఇచ్చి.. ఆ తర్వాత నిలిపివేశాయి. మిగిలిన రూ.4,300 కోట్లకు తాజాగా ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్ అండ్ సెక్యూరిటీస్‌ను కార్పొరేషన్ అడగ్గా.. ఈ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇటీవల జరిగిన కార్పొరేషన్ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించారు. మరోవైపు దేవాదుల, వరదకాలువ పనుల పూర్తికి రుణం ఇచ్చిన ఆర్‌ఈసీ.. ఈ రెండు ప్రాజెక్టుల పనులు పూర్తి కాకపోవడంతో గడువును వచ్చే మార్చి వరకు పొడిగించింది. వాస్తవానికి ఇవి 2022 మార్చి నాటికే పూర్తి కావాలి. ఒప్పందం ప్రకారం రుణం తిరిగి చెల్లింపు ప్రక్రియ మాత్రం ప్రస్తుత నెల నుంచే ప్రారంభం కానుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ 2021 జులైలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో ఉన్న వాటికి రుణం మంజూరు వీలు కాదని తాజాగా రాసిన లేఖలో ఆర్‌ఈసీ పేర్కొంది.
ఇవీ చదవండి: