ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM Kisan Samman Nidhi) పథకం నిధులు పూర్తిస్థాయిలో తెలంగాణకు అందలేదు. ఇక్కడ 4.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో తాజా విడత సొమ్ము జమ కాలేదు. మొత్తం 39.34 లక్షల మంది లబ్ధిదారులుండగా 35.16 లక్షల మంది ఖాతాల్లో రూ.703.35 కోట్లు జమ చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ పేర్కొంది. మిగిలిన రైతుల ఖాతాల్లో ఎందుకు జమ చేయడం లేదనేది వెల్లడించలేదు.
పక్కనే ఉన్న మహారాష్ట్రలో 1.14 కోట్ల మంది లబ్ధిదారులుంటే వారిలో 99 శాతం మందికి, వెనుకబడిన ఒడిశాలో 40.50 లక్షల మందిలో 99 శాతం మంది ఖాతాల్లో సొమ్ము జమయింది. తెలంగాణ వ్యవసాయశాఖ ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ పథకానికి రైతుల పేర్లు నమోదు చేయగా, 89 శాతం మంది ఖాతాల్లోనే సొమ్ము వేయడం గమనార్హం. పీఎం కిసాన్ పథకం నిధులను ఏటా మూడుసార్లు రూ.2 వేల చొప్పున రైతు కుటుంబం ఖాతాలో కేంద్ర వ్యవసాయశాఖ నేరుగా జమ చేస్తుంది. ఈ పథకం కోసం కేంద్రం ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటుచేసి ఆన్‌లైన్‌లో వివరాలు పెడుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘రైతుబంధు’ పథకం వివరాలు గానీ, పీఎం కిసాన్ లబ్ధిదారుల వివరాలు గానీ వెబ్‌సైట్‌లో పెట్టడం లేదు. తాము ఎవరిని అడగాలో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు. తమ ఖాతాలో ఎందుకు పీఎం కిసాన్ సొమ్ము పడలేదని రైతులు ‘వ్యవసాయ విస్తరణ అధికారి’(ఏఈఓ)ని అడుగుతుంటే జవాబివ్వలేకపోతున్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావును వివరణ అడిగేందుకు ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
ఇదీచూడండి: Potato Cultivation in Telangana : తెలంగాణలో యాసంగికి 50వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగు