రాష్ట్రంలోని సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వాటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలలూ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కొవిడ్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తగా రీజనల్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
కొవిడ్ రోగులకు 324 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలన్నారు. హైదరాబాద్‌లో మరో 100టన్నుల ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని చెప్పారు. పది రోజుల్లో ట్యాంకర్లు అందించాలని ఉత్పత్తిదారులను కోరిన సీఎం.. ఆక్సిజన్ సరఫరా విషయంలో ఇతర రాష్ట్రాలపై ఆధారపడవొద్దన్నారు.
చికిత్స, సౌకర్యాలు ఉన్నందున పేదలు ప్రభుత్వాస్పత్రుల్లోనే చేరాలని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో 6,926 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలపగా.. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు కోఠి ఈఎన్‌టీ, గాంధీ ఆస్పత్రిలో సదుపాయాలున్నట్లు చెప్పారు. జిల్లాల్లోని వైద్య కళాశాలల ఆస్పత్రుల్లోనూ సామగ్రి, మందులు సమకూర్చాలని అధికారులను సీఎం ఆదేశించారు. టీకాల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని.. కేంద్రం నుంచి రావాల్సిన టీకాల విషయంలో నిరంతరం సంప్రదించాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.86 లక్షల డోసులు ఉన్నాయని అధికారులు సీఎంకు నివేదించారు.
ఇదీ చదవండి: అతితీవ్ర తుపానుగా తౌక్టే- 'మహా'లో విధ్వంసం