ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ తయారీదారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 375 కంపెనీలు పాల్గొంటున్నాయి. దేశీయంగానే కాక, విదేశీ సంస్థలు పౌల్ట్రీరంగంలో వాడే దానా, మందులు, యాంటీబయాటిక్స్, కృత్రిమ మేధ, రోబోటిక్ పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. పౌల్ట్రీ మనుగడ, అభివృద్ధి కొరకు కొత్త పద్ధతులు, శాస్త్రీయతపై పౌల్ట్రీ రైతులకు అవగాహన సద్ససులు సైతం నిర్వహిస్తున్నారు. కోళ్ల రైతులతో పాటు పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధికి ఈ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని సందర్శకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో గత 12 ఏళ్లుగా జరుగుతోన్న పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో గతం కంటే ఈ ఏడాది సందర్శకుల తాకిడి కాస్త తగ్గిందని.. ముఖ్యంగా రాష్ట్రం నుంచి ఆదరణ పెరగాల్సిన అవసరం ఉందని శ్రీనివాస ఫార్మ్స్ ఎండీ, ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ఛైర్మన్ సురేష్ చిట్టూరి అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, బంగ్లాదేశ్ నుంచి సందర్శకులు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ కు మొత్తం 35 వేల మంది సందర్శకులు వస్తారని వారు అంచనా వేస్తున్నారు. మొత్తం 375 కంపెనీలు తమ పరికరాలను సందర్శకులకు అందుబాటులో ఉంచాయి.
ఇవీ చూడండి: రాజధాని శివారులో యువ వైద్యురాలి దారుణహత్య