Telangana Dalita Bandhu Budget 2023-24 : స్వతంత్ర భారతదేశంలో దళితజాతి నేటికీ అంతులేని వివక్షకు, దాడులకు గురవుతూనే ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతమేరకు వెలుతురు ప్రసరించిందని తెలిపారు. ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదని..ఫలితంగా నేటికీ దళితవాడలు వెనుకబాటుతనానికీ, పేదరికానికీ చిరునామాలుగానే ఉండిపోతున్నాయని వెల్లడించారు.
Telangana Dalita Bandhu Budget 2023 : 'అణగారిన దళితజాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే దళితబంధు. దళితజాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి రూపుదిద్దారు. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. దళితబంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా.. ఆ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడటానికి తోడ్పడుతుంది. దళిత సోదరులు వ్యాపార రంగంలోనూ ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ లైసెన్సుల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తుంది. దళితబంధు పథకం కోసం ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు ప్రతిపాదిస్తున్నాం.' అని హరీశ్ రావు అన్నారు.
షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని హరీశ్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి నిధుల కేటాయింపునకు చట్టబద్ధత కల్పించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించిందని వెల్లడించారు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో నిధులు పూర్తిగా ఖర్చుకాని పక్షంలో ఈ చట్టం ప్రకారం ఆ నిధులను తర్వాతి సంవత్సరానికి ఖచ్చితంగా బదలాయింపు చేయాలని చెప్పారు.
షెడ్యూలు కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద రాష్ట్ర బడ్జెట్‌లో రూ.36,750 కోట్లు ప్రతిపాదించారు. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి.. అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఈ పథకం కింద 953 మంది విద్యార్థులకు స్కాలర్ ఫిప్‌లు మంజూరు చేశారు.
ఇవీ చదవండి: