మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడిన కేసులో అరెస్టు చేశారు. రెండ్రోజుల క్రితం మియాఖాన్‌గడ్డలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడినందుకు రేవంత్‌రెడ్డి, అయన సోదరుడు, అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బుధవారం ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు రేవంత్‌రెడ్డికి నోటీసులిచ్చారు. నోటీసులకు స్పందించి రేవంత్‌రెడ్డి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. గోల్కొండ ప్రభుత్వాస్పత్రిలో ఎంపీకి వైద్యపరీక్షలు నిర్వహించి.. న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.
రేవంత్ రెడ్డి అరెస్టును పలువురు కాంగ్రెస్ నేతలు ఖండించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిలు ఆరోపించారు. ఎంపీని అరెస్ట్ చేయడమేంటని వారు ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
తెలంగాణలో నియంత పాలన సాగుతోందని... రాజ్యాంగం, చట్టాలతో పని లేకుండా కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని, ఈ అప్రజాస్వామిక పాలనపై కలిసికట్టుగా ఉద్యమించాల్సి ఉందని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: తన భూముల్లో జోక్యం చేసుకోవద్దంటూ.. రేవంత్ పిటిషన్