కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేసిన లాక్‌డౌన్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎక్కువ మంది ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత ఇళ్లకే పరిమితంకాగా... నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చేవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో భారీ ఎత్తున వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
డీజీపీ పర్యటన
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉదయం 10 తర్వాత వచ్చినవారి వాహనాలను సీజ్ చేసిన పోలీసులు... అనంతరం వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కొంపల్లిలో అంబులెన్సులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దారి ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. మీర్‌పేట్, బాలాపూర్ పరిధిలోని చెక్‌పోస్టులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో లాక్‌డౌన్ అమలును డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. వైరస్ కట్టడికి కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు.
బయటకు వస్తే ఊరుకునేది లేదు
వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను కట్టడి చేస్తున్నారు. ఉదయం 10 తర్వాత అనవసరంగా బయటకు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మంథని, కమాన్‌పూర్, రామగిరిలో లాక్‌డౌన్‌ను సీఐ సతీశ్ పర్యవేక్షించారు. ఉదయం 10 తర్వాత ఎవరూ వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంచవద్దని సామాజిక మాధ్యమాలు, మైకుల ద్వారా ప్రచారం చేశారు.
పటిష్ఠంగా లాక్‌డౌన్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. జిల్లా సరిహద్దుల్లో ముమ్మరంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు... జిల్లా కేంద్రాల్లో ఎక్కువగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ ఉదయం పది తర్వాత విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్, పోలీస్ కమిషనరేట్, పులాంగ్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. సంగారెడ్డిలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: 'ఆనందయ్య ఔషధంపై 5 రోజుల్లో తుది నివేదిక'