Small Plants: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జరుగుతున్న.. 12వ గ్రాండ్ నర్సరీ మేళాలో చిట్టి మొక్కలను చూస్తుంటే రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఉన్నాయి. మనసుండాలి కానీ మార్గం లేకుండా పోదు. ఇండోర్ మొక్కలను పెద్ద పెద్ద కుండీల్లోనే పెంచాల్సిన పనిలేదు. చాలా చిన్న కుండీల్లో పెంచుకునే మొక్కల రకాలు వచ్చాయి. ఎక్కువగా ఎడారి జాతిని వీటిలో పెంచుతున్నారు. జడే ప్లాంట్, బిగోనియా, ఫిట్టోనియా ఆర్పిడ్స్, ఆఫ్రికన్ వాయిలెట్స్, ఆలోవెరా, బేబిటోస్, ప్లేమింగో ప్లవర్.. ఇంకా ఎన్నో రకాల పూల మొక్కలు పెంచుకోవచ్చు.
ఆకుపచ్చ రంగులో ఆకులతో కొన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటే.. మరికొన్ని పూలగుత్తి ఆకారంలో భిన్న రంగుల్లో పెరిగి అబ్బురపర్చేలా ఉన్నాయి. ఇంట్లో పెంచుకునే ఈ మొక్కలను అభిరుచి కలిగినవారు మరింత అందంగా పెరిగేలా చూసుకోవచ్చు. జడే మొక్కతో చాలా ప్రయోగాలకు అవకాశం ఉంది. వీటిని చూస్తే ఇంటికొచ్చిన అతిథులు ఫిదా అవ్వాల్సిందే. దీంతో మొక్కల ప్రియులు కొనుగోలు చేస్తూ సందడి చేస్తున్నారు.
చిట్టి మొక్క నిర్వహణ సులభమే. ఎక్కువ నీరు అవసరం లేదు. కొద్ది నీటితో వారం రోజుల వరకు ఆరోగ్యంగా పెరుగుతాయి. కొన్నింటికి రోజు తప్పించి రోజు నీరు పోస్తే సరిపోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని మొక్కలకు రోజులో గంట సేపు ఎండ నేరుగా కాకుండా వెలుతురులో ఉంచితే చాలని.. స్థలం ఉంటే బాల్కనీలోనే పెంచుకోవచ్చని తెలిపారు. మొక్కల ప్రియులతో గత ఐదు రోజులుగా పీపుల్స్ ప్లాజా కళకళలాడుతోంది. నేటితో ఈ మేళ ముగియనుంది.
"చాలా తక్కువ ధరలో పూలమొక్కలు లభిస్తున్నాయి. వివిధ రకాల పూల ఉత్పతులతో ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఇంటికి అలంకరణతోపాటు, సులభంగానే పెంచుకోవచ్చు". -కొనుగోలుదారులు