Corona in IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. అక్కడ నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో మొత్తం 119 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులకు స్వల్ప లక్షణాలు మినహా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని యాజమాన్యం వెల్లడించింది. వైరస్ సోకిన వారందరినీ ఐఐటీ హైదరాబాద్ వసతి గృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసి... చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉన్నామని.. గత కొన్నిరోజులుగా ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.
వరంగల్ నిట్‌లో కరోనా
Warangal NIT Corona Cases: వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ- నిట్‌లో కూడా ఇటీవల కరోనా కలకలం రేగింది. కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల క్రిస్మస్ వేడుకలకు ఇంటికెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో... నలుగురు విద్యార్థులు, అధ్యాపక బృందంలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కేసులు వెలుగుచూడటంతో వెంటనే ప్రత్యక్ష తరగతులను నిలిపివేశారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారందరిని క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ నెల 16 వరకు... విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన అందిస్తామని నిట్ డైరెక్టర్ ఎన్.వి రమణారావు పేర్కొన్నారు. క్యాంపస్‌లో ఉండే మిగతా ఉద్యోగులందరికీ పరీక్షలు చేయించనున్నట్లు ఆయన వివరించారు.