ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా నిరసనలు ప్రేమికుల దినోత్సవం కాస్త ప్రేమ నిషేధ దినంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వాలెంటైన్స్ డే అడ్డుకోవడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. విదేశీ సంస్కృతికి దూరంగా ఉండాలని, ప్రేమజంటలు పార్కుల్లో కనిపిస్తే పెళ్లి చేస్తామని హెచ్చరించారు. ప్రేమికులు బయటకు రావడానికి భయపడ్డారు. హైదరాబాద్ పార్కులు నిర్మానుష్యంగా కనిపించాయి.
భజరంగ్ దళ్ కార్యకర్తలు అబిడ్స్ జీపీవో కూడలిలో వాలెంటైన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ రోజు పబ్‌లు, కాఫీ డేలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించొద్దని హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భజరంగ్ దళ్, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వాలెంటైన్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఆదిలాబాద్‌లో ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. పాశ్చాత్య సినిమా పోస్టర్లు చింపివేశారు.