తెలంగాణ పురపాలక చట్టం 2019 బిల్లు శాసనసభ ముందుకు వచ్చింది. జవాబుదారీతనంతో పాటు వికేంద్రీకరణ పద్ధతితో పట్టణ పాలన ఏర్పాటుకు వీలుగా బిల్లు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్ మినహా మిగతా పురపాలక కౌన్సిల్లు, పురపాలక కార్పొరేషన్ల కోసం ఒకే చట్టాన్ని రూపొందించేందుకు బిల్లును ప్రతిపాదించినట్లు పేర్కొంది.
బిల్లులోని ముఖ్యాంశాలు
పురపాలిక పాలకమండళ్లతో పాటు మేయర్ లేదా ఛైర్ పర్సన్, కమిషనర్లకు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు నిర్దిష్ట బాధ్యతలు
- ప్రతినెల పురపాలక కౌన్సిల్ సమావేశం, ప్రతి ఏడాది అకౌంట్ల ఆడిటింగ్
- పట్టణంలో పారిశుద్ధ్యం, నీటిసరఫరాపై ప్రత్యేకంగా దృష్టి
- వర్షంనీటి సంరక్షక నిర్మాణాలు, పురపాలికకు గ్రీన్ యాక్షన్ ప్లాన్, మొక్కల పెంపకానికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు
- 85 శాతం కన్నా తక్కువ మొక్కలు బతికితే వార్డు సభ్యుడు లేదా ప్రత్యేక అధికారిపై వేటు
- పదిహేను మందితో రొటేషన్ విధానంలో ఏర్పాటయ్యే వార్డు కమిటీలకు పారిశుద్ధ్యం, హరితహారం, ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడటం లాంటి బాధ్యతలు
- ఏళ్ల తరబడి ఒకేచోట ఉండకుండా రాష్ట్రంలోని అన్ని పురపాలికలు, కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలకు అధికారుల బదిలీ ఉండే వెసులుబాటు
- ఈ- గవర్నెన్స్ సాయంతో ఆన్లైన్ సేవలు. నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయకపోతే బాధ్యులకు జరిమానా
- ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్, సభ్యుడి సస్పెన్షన్, తొలగింపునకు ప్రభుత్వం లేదా జిల్లా కలెక్టరుకు అధికారాలు
- పురపాలన పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టరుకు ప్రత్యేక, అత్యవసర అధికారాలు, పట్టణాల్లోనూ కలెక్టర్ పాత్ర క్రియాశీలకం
- ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
- రాష్ట్రంలోని పురపాలికలన్నింటికీ సహాయ, సాంకేతిక మార్గదర్శకం చేసేందుకు రాష్ట్ర ఆస్తిపన్ను బోర్డు ఏర్పాటు
- పన్నులు, ఇతరత్రా నిధులతో పాటు పురపాలికలకూ బాండ్లు లేదా ఇతర వనరుల ద్వారా రుణాలు సమకూర్చుకునే అవకాశం
- ప్రతి పట్టణానికి తప్పనిసరిగా పారిశుద్ధ్య ప్రణాళిక, వందశాతం ఘన వ్యర్థాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ
- భూసేకరణ, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, కాలువలు, హరిత ప్రదేశాలు, ట్రాఫిక్ రవాణా ప్రణాళికలతో కలిపి మాస్టర్ ప్లాన్
- ఎవరైనా రహదారులు, కాలువలుకు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న మొక్కలకు నష్టం కలిగించినా చర్యలు
- కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి, ఉద్దేశపూర్వకంగా కాలుష్యాన్ని కలగజేస్తే జరిమానా
- లేఅవుట్ల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు, అనధికార లేఅవుట్లపై చర్యల కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
- సమీకృత పట్టణాలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్మాణదారులకు ప్రోత్సాహకాలు
- నివాస, కార్యాలయ ప్రదేశాలు, వాణిజ్య, వినోద సేవలు, మౌలిక సదుపాయాల హబ్‌లుగా సమీకృత టౌన్ షిప్‌ల అభివృద్ధి
- వ్యక్తిగత, స్వతంత్ర లేదా నివాస భవనాలలో తప్ప అన్ని పార్కింగ్ ప్రదేశాలలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం
ప్రతిపాదిత చట్టం ప్రకారం 128 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్లు ఉంటాయి. ఇప్పటి వరకు మున్సిపాల్టీలుగా ఉన్న బోడుప్పల్, ఫీర్జాదిగూడ, బండ్లగూడ జాగీర్, బడంగ్ పేట, జవహర్ నగర్, నిజాంపేటలను కార్పొరేషన్లుగా స్థాయి పెంచారు. మీర్‌పేట, జిల్లెలగూడ మున్సిపాల్టీలను విలీనం చేసి మీర్‌పేట కార్పొరేషన్‌గా ప్రతిపాదించారు. చట్టం ద్వారా రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రాంత స్థానిక సంస్థల సంఖ్య 140కి చేరుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక చట్టం వర్తిస్తుంది. అది కలిపితే పట్టణ ప్రాంత స్థానిక సంస్థల సంఖ్య 141 అవుతుంది.
మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు పదిహేను రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. నామినేషన్ తిరస్కరణపై అప్పీల్‌కు అవకాశం కల్పించారు. ఎన్నికల పిటిషన్ల విచారణకు ట్రైబ్యునల్‌గా జిల్లా కోర్టులు ఉంటాయి. రెండు దఫాలు ఒకే రిజర్వేషన్ అమలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన... మొత్తంగా 50 శాతానికి మించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఉంటాయి. అన్ని కేటగిరీల్లోనూ సగం సీట్లను మహిళలకు కేటాయిస్తారు. మేయర్, ఛైర్ పర్సన్ పదవి స్వీకరించిన తేదీ నుంచి మూడేళ్లు దాటాకే అవిశ్వాసానికి ఆస్కారం ఉంటుంది.
ఇవీ చూడండి: తొలిరోజు... వాడివేడిగా ప్రత్యేక అసెంబ్లీ