సీఆర్పీసీ 41ఏ కింద టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడో విడత నోటీసులు జారీ చేశారు. ఈనెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు... ఆయన ఇంట్లో లేనందున గోడకు నోటీసులు అంటించారు. ఏబీసీఎల్ కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్, మూర్తితో పాటు మహేష్‌పై కేసు నమోదు చేశారు.
హాజరు కాకపోతే...
రవిప్రకాశ్ డైరెక్టర్ల నియామకంలో అడ్డుపడుతున్నారని, ఫోర్జరీ పత్రాలు సృష్టించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. నటుడు శివాజీతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించారనే ఫిర్యాదులోనూ రవిప్రకాశ్, శివాజీపై కేసు నమోదైంది. గత ఐదు రోజులుగా రవిప్రకాశ్ అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు ఇంటితో పాటు పలు చోట్ల వెతుకుతున్నారు. ఈనెల 15వ తేదీ విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: తెలంగాణ సీజేగా జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ నియామకం..!