మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌లో మతలబు దాగి ఉందని ఉందని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ఒక్కోసారి ఒక్కో రకంగా పోలింగ్ శాతాలను ఏ విధంగా వెల్లడించారో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
11న సాయంత్రం 5 గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 5.26 శాతం అంటే 15,36,784 ఓట్లు పెరిగాయన్నారు. అందులో నిజామాబాద్‌లో అత్యధికంగా 14.13 శాతం, ఖమ్మంలో 7.28 శాతం, సికింద్రాబాద్‌లో 7.06 శాతం లెక్కన మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాలు పెరగ్గా... ఒక్క చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం 0.58 శాతం అంటే 14,146 ఓట్లు తగ్గాయని... అదేలా సాధ్యమని ప్రశ్నించారు. పోల్ అయిన ఓట్ల వివరాలను అందించడంలో రజత్‌కుమార్ అనుసరించిన తీరును తప్పుబట్టారు. ఎందుకు ఆలా లెక్కలు చెప్పాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని మర్రి డిమాండ్ చేశారు.