కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి సోదరుల మధ్య చాలాకాలంగా అంతర్గత విబేధాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత విబేధాలు మరింత ముదిరాయి. ఎన్నికల ముందు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్సీ కుంతియాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అప్పట్లో పీసీసీ క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. కోమటిరెడ్డి సోదరులు పార్టీని వీడితే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర నాయకత్వం రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.
గెలిచిన సంతోషం కూడా లేకుండానే...
శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాతో మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు వెళ్లిన కాంగ్రెస్‌కు తీవ్ర పరాభవం ఎదురైంది. కేవలం 19 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకుంది. తర్వాత పరిణామాల్లో 12 మంది శాసనసభ్యులు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు సీనియర్ నేతలు లోకసభ ఎన్నికల ముందుకు భారతీయ జనతాపార్టీలో చేరారు. ఇలాంటి కష్టకాలంలోనూ మూడు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకున్న సంతోషం కంటే పార్టీలో ఏర్పడిన అనిశ్చితి పరిస్థితులే నాయకత్వాన్ని కలవరపరిచాయి.
విమర్శలు... షోకాజులు
దెబ్బ మీద దెబ్బతో సతమతమవుతుండగా... ఈ నెల 15న నల్గొండలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీలు ఇచ్చి, 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాలతోనే ఆయన పార్టీ మారుతున్నారని ఉత్తమ్ దిల్లీలో వివరణ ఇచ్చిన కాసేపటికే... రాజగోపాల్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని, ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని విమర్శించారు. ఆయన రాజీనామా చేస్తేనే పార్టీ బాగుపడుతుందన్నారు. కష్టకాలంలో పార్టీని ఆదుకున్న తమకు షోకాజ్ ఇచ్చే అర్హత కాంగ్రెస్‌కు లేదని ధ్వజమెత్తారు. ప్రజాక్షేత్రంలో గెలవలేని వి. హనుమంత రావు లాంటి వారు కూడా తమపై విమర్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి:మహత్తర ఘట్టానికి ఘనమైన ఏర్పాట్లు