జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండాలు ఎగరాలని తెరాస శ్రేణులకు సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో 32 జడ్పీ స్థానాలు, 530కి పైగా మండల పరిషత్ కైవసం చేసుకోవాలన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ, పంచాయతీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పట్టారన్నారు. లోక్సభ ఎన్నికల్లో పదహారు స్థానాల్లో గెలుపు ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
మంత్రులదే బాధ్యత
స్థానిక సంస్థల ఎన్నికలనూ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతలు మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. రాష్ట్రంలోని 32 జడ్పీ స్థానాలకు ఇంఛార్జీలుగా 25 మంది సీనియర్ నేతలను నియమించారు. కొత్తగా చేరిన వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యతను మంత్రులకు అప్పగించారు.
అందరికీ అండగా
32 జిల్లా పరిషత్లపై కన్నేసిన గులాబీ దళపతి రెండు జిల్లాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆసిఫాబాద్ జడ్పీకి కోవా లక్ష్మి, పెద్దపల్లికి పుట్ట మధుల పేర్లు ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు బాధపడాల్సిన అవసరం లేదని.. వారికి తగిన పదవులు ఇచ్చి గౌరవిస్తామని గులాబీబాస్ హామీ ఇచ్చారు. పార్టీలోకి వచ్చిన వలసల గురించి నేతలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని.. కొత్తవారికి, పాత వారికి అందరికీ న్యాయం జరుగుతుందని కేసీఆర్ అన్నారు.
సంస్కరణల సమయం
రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కలెక్టర్, తహసీల్దార్ ఇతర పాలన యంత్రాంగంలో కీలక మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్ వ్యవస్థల్లో కొన్ని లోపాల వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని గులాబీ దళపతి అన్నారు. ఉద్యమ సమయం నుంచి తెరాసపై ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారని.. వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందన్నారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఇవీ చూడండి: "మోదీ ప్రచారానికి డబ్బులెక్కడివి..?"