ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఇలా నినాదాలు చేయటం రాష్ట్ర చరిత్రలో తొలిసారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిష్పాక్షికంగా, ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ నిర్విహించాల్సిన ఈసీ..అసలు పని వదిలేసి బదిలీల పేరిట హడావుడి సృష్టించడానికి, తమకు అనుకూలమైన ఫిర్యాదులపై స్పందించడంపైనే దృష్టి సారించిందనే ఆరోపణలూ వెల్లువెత్తాయి.
వెల్లువెత్తిన ఓటరు..
ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. చిన్నాపెద్ద, ఆడా మగ అన్న తేడా లేకుండా యావత్ రాష్ట్రం భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. తమ తీర్పుని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మండుటెండలు, ఉక్కపోత, దూరభారాలు, వ్యయప్రయాసలకు లెక్కచేయకుండా ఓటర్ల నుంచి వచ్చిన ఈ స్పందనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఓట్ల పండుగ విజయవంతమైందని అంతా సంతోషిస్తున్నారు. కానీ...బృహత్తర క్రతువుని నడిపించిన ఈసీకి ఎన్ని మార్కులు వేయొచ్చు? ఆంధ్రప్రదేశ్ అంతటా ఇప్పుడిదే ప్రశ్న.
ఈసీ తీరు ఘోరం
ఓటర్ల స్ఫూర్తిని ఏమాత్రం పట్టించుకోకుండా పోలింగ్ నిర్వహణ అస్తవ్యస్తంగా చేసిందని.. ఈసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ఓటింగ్ జరిగిందని ఎంత ఘనంగా చాటుకున్నా.... అది ప్రజల్లో వచ్చిన చైతన్యం తప్ప ఈసీ సాధించింది ఏమీ లేదని గురువారం పోలింగ్ సరళితో స్పష్టమైందంటున్నారు విమర్శకులు. పటిష్ఠంగా ఓటర్ల జాబితా రూపొందించామని ఈసీ చెప్పినా ... తమ పేర్లు గల్లంతయ్యాయని పలువురు ఆందోళనకు దిగటం వాస్తవం పరిస్థితిని కళ్లకుకట్టింది. శ్రీకాకుళంలో అయితే ఓట్లు తొలగింపుపై నగర పాలక సంస్థ వద్దకు చేరుకున్న స్థానికులు ఆందోళన చేపట్టారు. అధికారుల వ్యవహర శైలిపై మండిపడ్డారు. కావాలని మహిళల ఓట్లు తొలగించారని ఆరోపించారు.
పోలింగ్ ఆలస్యం
పోలింగ్ 7గంటలకు ప్రారంభమవుతుందనగా.., 6:30గంటల నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. వృద్ధులు, మహిళలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు. కానీ చాలా చోట్ల పోలింగ్ సకాలంలో ప్రారంభం కాలేదు. ప్రధాన ఎన్నికల అధికారి ఓటు వేసే కేంద్రంలోనే ఈవీఎం మొరాయించటం.. ఆ సమయంలో ఆయన ఓటు వేయలేక వెనుతిరగటం... పరిస్థితిని కళ్లకు కట్టింది. సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు ఓటేసిన పోలింగ్ కేంద్రంలోను 25నిమిషాలు ఆలస్యంగా... ఆయన మరో 10నిమిషాల్లో వస్తున్నారనగా ఓటింగ్ ప్రారంభమైంది. విజయవాడలోని పలు కేంద్రాల్లో దాదాపు 7గంటల పాటు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
నిబంధనలు పట్టవా..?
పోలింగ్ ప్రారంభించడంలో 2 గంటలు జాప్యం జరిగితే.. మరుసటి రోజు ఇంతే సమయం పోలింగ్ నిర్వహించేందుకు వీలుందని ఎన్నికల సంఘం 2009 జనవరి 21న చేసిన జారీ చేసిన 25వ నంబరు సూచన చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 622 కేంద్రాల్లో 2 గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అందుకే తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరుసటి రోజు పోలింగ్ నిర్వహించాలని సీఈసీ, సీఈవోకి లేఖలు రాశారు. ఆ విజ్ఞప్తిని పరిశీలిస్తామంటూనే సాయంత్రం వరకు సాగదీసింది ఈసీ. ఫలితమే... అర్థరాత్రి దాటేవరకు సాగిన పోలింగ్. ఈసీ తీరుకు నిరసనగా.. మంగళగిరిలో అయితే మంత్రి నారా లోకేశ్ స్వయంగా ధర్నాకు దిగాల్సి వచ్చింది.
ఉదయం నుంచి ఈవీఎంలు మొరాయించిన చోట్ల క్యూలైన్లలో వేచి ఉండలేక కొందరు... నిలబడే ఓపిక లేక ఇళ్లకు వెళ్లిపోయారు. వాళ్లలో ఎందరు తిరిగొచ్చి ఓటేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ‘మై ఓట్ క్యూ యాప్’ కూడా పూర్తిగా విఫలమయిందనే విమర్శలు వచ్చాయి. ఈ యాప్ సాయంతో ప్రతి పోలింగ్ కేంద్రం సమాచారం తెలుసుకోవచ్చని, ఖాళీ సమయం గుర్తించి ఓటేయవచ్చని చెప్పింది ఈసీ. ప్రతి 5 నిముషాలకు అందులో సమాచారాన్నీ అప్‌డేట్ చేస్తామంది. కానీ అవేవీ జరగలేదు. ఈవీఎంల నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి కనీస శిక్షణ ఇవ్వలేదన్నది మరో ఆరోపణ.
సాంకేతిక సమస్యేనా..?
ఒకటో రెండో లేదా ..10చోట్లో ఈవీఎంలు పనిచేయలేదంటే, సాంకేతిక సమస్య అనుకోవచ్చు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో అలా జరగటం దేనికి సంకేతం? సాంకేతిక సమస్యలతో పాటు, వాటిని ఆపరేట్ చేయడంలో సిబ్బందికి తగిన పరిజ్ఞానం లేకపోవడం కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణం. రాష్ట్రవ్యాప్తంగా 4,583 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయనే ఫిర్యాదును ఉదయమే అధికార పార్టీ ఈసీ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. ఈసీ మాత్రం ఈ సంఖ్య వందల్లోనే అంటోంది. ఈ అంకెల మాటెలా ఉన్నా... రాష్ట్రంలో లక్షలాది మంది ఓటర్ల గోడు ఎవరికీ పట్టలేదన్నది వాస్తవం. సరిచేశాక వచ్చి ఓటేయండి అన్నట్లు సిబ్బంది వ్యవహరించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవడమే ఆలస్యం.. ఎక్కడికక్కడ ఈవీఎంలు మొరాయించాయనే ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. సాయంత్రం దాకా ఇదే పరిస్థితి కొనసాగింది. ఒక్కో కేంద్రంలో 45 నిమిషాల నుంచి 7 గంటల వరకు పోలింగ్ నిలిచిపోయింది.
గంటల తరబడి పోలింగ్ కేంద్రాల ముందు నిరీక్షించలేక కొందరు సొమ్మసిల్లారు. ఎండ వేడి, ఉక్కపోతలు తట్టుకోలేక మరికొందరు ఇళ్లకు వెళ్లిపోయారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారూ అవస్థలు పడ్డారు. విజయవాడలోని పలు కేంద్రాల్లో మహిళలు 'ఈసీ డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేయటం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.
అర్ధరాత్రి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకోవడానికి నిలబడి ఉన్నారంటే వారెంత కృతనిశ్చయంతో ఉన్నారో అర్ధమవుతోంది. ఉదయం 9 గంటల సమయానికి కేవలం 9% ఓట్లే పోలయ్యాయి. 11 గంటలకు 23.22%, ఒంటి గంటకు 40.53%, మూడు గంటలకు 54.66%, 5 గంటలకు 65.96%, సాయంత్రం ఆరు గంటల సమయానికి 70% పోలింగ్ నమోదైంది. అప్పటికి కూడా భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉండటం, రాత్రి 10 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగటంతో పోలింగ్ 80% దాటొచ్చని ముందే అంచనా వేశారు.
ఓటర్ల నిరాశ........
వృత్తి, ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వేల సంఖ్యలో సొంత గ్రామాలు, పట్టణాలకు తరలి వచ్చినవారిలో చాలా మంది ఓటర్ల జాబితాలో పేర్లు లేనందున తీవ్ర నిరాశకు గురయ్యారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇరుకుగా ఉన్న ఒకే ప్రాంగణంలో నాలుగైదు పోలింగ్ కేంద్రాలను పెట్టినందున బాగా రద్దీ నెలకొంది. సాధారణంగా ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో గరిష్ఠంగా 1,200 మంది వరకూ మాత్రమే ఓటర్లను చేర్చామని చెప్పిన ఈసీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం క్రిస్టియన్ పేట పరిధిలోని 37వ పోలింగ్ కేంద్రంలో 2,097 మంది ఓటర్లను చేర్చారు. దీంతో గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది.
మొత్తంగా చూస్తే.. ప్రజాస్వామ్య పండుగ అయిన సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో విఫలమైందనే అపవాదు మూటగట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ఈసీ. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా అనేక బూత్‌లలో అర్ధరాత్రి వరకు పోలింగ్ నిర్వహించిన దుస్థితి కల్పించింది.