నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్లో భవనాలను కూల్చవద్దని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై... ఇవాళ మరోసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. ఎర్రమంజిల్ భవనాలు చారిత్రక కట్టడాలని... అసలు మళ్లీ కొత్తగా అసెంబ్లీ భవనాలు నిర్మించాల్సిన అవసరం లేదన్న పిటిషనర్ల అభ్యంతరాలపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. ప్రస్తుత అసెంబ్లీ సరిపోవడం లేదని... భద్రతాపరంగా లోపాలున్నాయన్నారు. నిపుణుల సిఫార్సుల మేరకే కొత్త శాసనసభ నిర్మించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఎర్రమంజిల్ భవనాలు చారిత్రక పరిరక్షణ కట్టడాల పరిధిలో లేవని.. వాటిని తొలగిస్తూ గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. అయితే ఒకసారి పరిరక్షణ కట్టడాల పరిధిలోకి వచ్చిన తర్వాత... వాటిని కాపాడాల్సిందేనని జనరల్ క్లాజ్ చట్టంలోని సెక్షన్ ఆరు చెబుతోంది కదా అని హైకోర్టు అడిగింది. ఏ చట్టం లేదా ఏ నిబంధన ప్రకారం వాటిని కూల్చివేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని... సర్కారు కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలపై దాఖలైన వ్యాజ్యాలన్నింటిపై విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: రేపట్నుంచే శాసనసభ ప్రత్యేక సమావేశాలు