![Wandering tiger in bhadradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-kmm-02-27-bhadradrilo-puli-av-ts10042_27112020104231_2711f_1606453951_1098.jpg)
భద్రాచలం ఏజెన్సీలో పులి అడుగు జాడలు కలకలం రేపుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్, సారపాక ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు చూశామని కొందరు స్థానికులు చెబుతున్నారు. బూర్గంపహాడ్ మండలం సారపాక పుష్కరవనం అడవి నుంచి నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం వైపు రోడ్డు దాటినట్లు తెలిపారు.
![Wandering tiger in bhadradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-kmm-02-27-bhadradrilo-puli-av-ts10042_27112020104231_2711f_1606453951_885.jpg)
శుక్రవారం ఉదయం సారపాక మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద పత్తి చేనులో పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులకు ఓ రైతు తెలిపారు. సారపాక సమీపంలో పులి ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పత్తి చేనులో 7 నుంచి 8 సెంటీమీటర్ల వరకు పులి అడుగులు గుర్తించినట్లు వెల్లడించారు. అడుగులు స్పష్టంగా కనిపించినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారి వేణుబాబు సూచించారు.
![Wandering tiger in bhadradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-kmm-02-27-bhadradrilo-puli-av-ts10042_27112020104231_2711f_1606453951_402.jpg)
పులికి ఉచ్చులు వేయడం, మందు పెట్టడం వంటివి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హెచ్చరించారు. జంతువులకు పులి ద్వారా హాని కలిగితే ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాన్ని ఇప్పిస్తామని వెల్లడించారు. సారపాక, బూర్గంపాడు, రెడ్డిపాలెం, కృష్ణసాగర్, సందేళ్ల, రామాపురం, ముసలిమడుగు ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: ఖమ్మం జిల్లాలో రైతులను హడలెత్తించిన హైనా