Vanama Raghava Land Kabza: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన వనమా రాఘవేంద్ర అరాచకాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. పాల్వంచ ప్రాదేశిక ప్రాంతంలోని బంగారుజాల బీట్ పరిధిలో దాదాపు 50 ఎకరాల అటవీ భూములను రాఘవ ఆక్రమించారు. పాల్వంచ పురపాలక పరిధిలోని సర్వే నెంబర్ 999, ఉప సంఖ్యల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పెద్దఎత్తున ఆయిల్ ఫామ్ సాగుతో పాటు అంతర్ పంటగా మొక్కజొన్న పండిస్తున్నారు.
బాధితుల ఆవేదన...
ఒకప్పుడు అడవి ఉండగా చెట్లను కొట్టేసి చదను చేశారు. ఈ భూమి పక్కనే రాఘవేంద్రకు చెందిన పట్టా భూములున్నాయి. వాస్తవానికి ఈ సర్వే సంఖ్యలో 4 వేల 180 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1153 ఎకరాలు అటవీ భూమి, 850 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. మిగిలింది రెవెన్యూ భూమి. ప్రస్తుతం అటవీ ప్రాంతం కొంత పోను మిగిలినదంతా ఆక్రమణలోనే ఉంది. కొన్నేళ్ల క్రితం కొంతమందికి భూమిని అసైన్డు చేశారు. ఇందులో కొంత విస్తీర్ణాన్ని రాఘవ బెదిరించి ఎంతో కొంత చేతుల్లో పెట్టి లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసైన్డ్ భూముల కబ్జా...
పేదలకు ఇచ్చిన అసైన్డు భూములనూ రాఘవేంద్ర అతడి అనుచరులు ఆక్రమించారు. విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారిలో పట్టా భూములు ఉన్నచోట స్థిరాస్తి వ్యాపారానికి మంచి గిరాకీ ఉంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాస గృహానికి ఎదురుగా ఉన్న చింతల చెరువులోనూ ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. చెరువు నీళ్లు ఉన్న చోటా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి భవనాలు నిర్మించారు. బంగారుజాలలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డు భూముల్లో 20 ఎకరాలను రాఘవా కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీకి చెందిన శ్రీదేవి... తనకు వారసత్వంగా వచ్చిన భూమిని రాఘవ కబ్జా చేశారని ఇప్పటికే ఫిర్యాదు చేశారు.
సమగ్ర విచారణ చేపడితే...
నిరుపేదలైన గిరిజనులు పోడు చేసుకున్న భూములు స్వాధీనపరుచుకునేందుకు నిత్యం వారి వెంటపడుతున్న అధికారులు... రాఘవేంద్ర ఆధీనంలోని అటవీ భూములను వెనక్కి తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా వనమా రాఘవేంద్ర చేసిన కబ్జాలు, అక్రమాలపై సమగ్ర విచారణ చేపడితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని బాధితులు అభిప్రాయపడుతున్నారు.