Two persons arrested for transporting Ganja in Badrachalam : పుష్ప సినిమాను అనుసరించి గంజాయి స్మగ్లర్లు వివిధ రీతులలో గంజాయి అక్రమ రవాణాకు తెర లేపుతున్నారు. పోలీసులకు కన్ను గప్పెందుకు అనేక అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాని రీతిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూన్నారు. కొందరు స్మగ్లర్లు టాటా మ్యాజిక్ ట్రావెల్ వాహనాలకు ప్రత్యేకంగా ఐరన్‌తో కింద ఒక బాక్స్‌ను తయారు చేసి గంజాయి రవాణా చేస్తుండగా, మరికొందరు ఏకంగా ట్రాక్టర్ కింద ఐరన్‌తో ఒక బాక్స్ ను తయారు చేసి అందులో గంజాయి తరలిస్తున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు చెక్ చేయగా.. ట్రాక్టర్ కింద సుమారు 500 కేజీ గంజాయి పట్టుబడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పారితోష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాష్ట్రంలోకి గంజాయిని రవాణా చేస్తున్నారు. పలుమార్లు ఏపీలోని విజయవాడ, గుంటూరుకి తరలించారు. రాష్ట్రంలో కరీంనగర్‌కు భద్రాచలం మీదుగా గంజాయిని తరలించి అమ్ముకునే వారు. ఈ క్రమంలోనే పోలీసులు కూనవరం చెక్ పోస్ట్, సీఆర్పీఎఫ్ క్యాంప్ వద్ద స్థానిక ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు. దీంతో నిందితులు వస్తున్న వాహనంపై అనుమానం వచ్చి పరిశీలించారు. పుష్ప సినిమాలో మాదిరి వారి వాహనంలో ఐరన్‌తో ఓ బాక్స్‌ని తయారు చేసి అందులో గంజాయిని పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.
Ganjay smaglling in Badrachalam : ఆ వాహనంలో 97 ప్యాకెట్ల గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. ఒక్కొక్క ప్యాకెట్లో 5 కిలోల గంజాయి పెట్టారు. మొత్తం 485 కిలోల గంజాయి ట్రాక్టర్లో ఉన్నదని తెలుసుకున్నారు. వారి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితులు రఘునాథ్, రబింద్రను పట్టుకున్నారు. వారితో మరో ఆరుగురు భాగస్వాములుగా ఉన్నట్లు తెలిపారు. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. రాష్ట్రంలో అక్రమ నిషేధిత వస్తువులు ఎవరు రవాణా చేసినా.. వారికి సహకరించినా.. పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా గంజాయి తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు వెంటనే తెలియజేయాలని ఆయన సూచించారు. గంజాయి రవాణా తదితర పనులు చేయడం చట్ట విరుద్దమని.. చేసిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగు, సరఫరాపై తమ ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు.
ఇవీ చదవండి :