Bhadradri Ramaiah Coronation Ceremony: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి వైదిక పెద్దలు చేసిన పట్టాభిషేక పూజలు ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేయగా భద్రాచలం దివ్యక్షేత్రం భూలోక వైకుంఠమై సాక్షాత్కరించింది. ఎక్కడ చూసినా... దేవదేవుడి క్రతువుకు సంబంధించిన ముచ్చట్లే. ఏ నోట విన్నా రామనామమే వీనులకు విందు చేసింది. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు.. అంటూ భక్తులు నీరాజనాలు పలికారు. సోమవారం ఉదయం పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు..తలనీలాలు సమర్పించుకుని మొక్కుల్లో భాగంగా కానుకలు సమర్పించారు.
ఆద్యంతం కనుల పండువగా: శ్రీరామనవమి తర్వాత రోజు పుష్యమి సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలతో దేవాలయ మాఢవీధులన్నీ రామమయంగా మారాయి. ఆలయం తలపులు తెరిచిన తర్వాత అర్చకులు రామయ్యకు సుప్రభాతం పలికి నామార్చన చేసి ఆరాధన కొనసాగించారు. రాజ లాంఛనాలతో గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి పూజలు చేశారు. కల్యాణ మూర్తులను శోభాయాత్రగా మిథిలా ప్రాంగణానికి తీసుకురాగా... పాహి రామచంద్రప్రభో అంటూ భక్తులంతా ప్రణమిళ్లారు. జయజయ ధ్వానాల మధ్య సీతారాముల వారిని మండపంలో వేంచేయింపజేసి క్రతువును ఆరంభించారు. సర్వలోకాలకు రారాజు అయిన రామయ్యకు పట్టాభిషేక వేడుక ఆద్యంతం మదిని దోచుకుంది. రామాలయ స్థానాచార్యులు స్థలసాయి, ప్రధాన అర్చకులు సీతారామానుజచార్యులు, విజయ రాఘవన్, ఉపప్రధాన అర్చకుడు రామస్వరూప్ పర్యవేక్షణలో సాగిన విష్వక్షేన పూజ, పుణ్యహావాచనం భక్తి భావాలను పంచింది. ఒక్కొక్క నగను చూపించి వాటి విశిష్టతలను వివరించగా... ఆభరణాల ప్రదర్శన తన్మయత్వాన్ని నింపింది.
ప్రియభక్తుడి పచ్చల హారంతో: మంత్రోచ్ఛారణ మారుమోగుతుండగా.. పట్టు పీతాంబరాలు ధరించి ప్రియభక్తుడు రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని అలంకరించుకున్న రామయ్య..రాచఠీవీని ఒలకబోశాడు. ఛత్ర, చామరాలు, పాదుకలను సమర్పించి ఖడ్గాన్ని అలంకరించి కిరీటాన్ని ధరింపజేశారు. సింహాసనాన్ని అధిష్టించిన రామచంద్రుని వైభవాన్ని చూడ కనులు చాలలేదు. సమస్త పుణ్యతీర్థాలతో అభిషేకం వైభవంగా జరిగింది. నీరజాక్షి సీతమ్మతో కలిసి రాజాధిరాజుగా సాక్షాత్కరించిన జగదభిరాముడు.. భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు.
సీతారాముల సన్నిధిలో గవర్నర్: మహా పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉదయం భద్రాచలం చేరుకున్నారు. నేరుగా రామాలయానికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ ఈఓ శివాజీ సాదర స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామిని, లక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. వైదిక పెద్దలు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆలయం నుంచి పట్టువస్త్రాలు శిరస్సుపై పెట్టుకుని పట్టాభిషేకం నిర్వహిస్తున్న మిథిలా ప్రాంగణానికి చేరుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మహాపట్టాభిషేక క్రతువును వీక్షించి ఆసాంతం ఆస్వాదించారు.
నా అదృష్టం: స్వామి వారి సేవలో తరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం, దేశానికి కరోనా మహమ్మారి గండం తొలగిపోవాలని రాములవారిని కోరుకున్నట్లు తెలిపారు. నాలుగో దశ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని... బూస్టర్ డోస్ వేసుకోవాలని సూచించారు. రామచంద్రుని ఆశీర్వాదం తనపై, ప్రజలపై ఉంటుందన్నారు.
జాడ లేని కలెక్టర్, ఎస్పీ: ఆదివారం సీతారామ కల్యాణ వేడుకను అన్నీతామై నడిపించిన కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఐటీడీఏ పీఓ గౌతమ్, ఎస్పీ సునీల్ దత్ గవర్నర్ పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. సోమవారం తెల్లవారు జామున గవర్నర్ తమిళిసై కొత్తగూడెం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన భద్రాచలం చేరుకున్న గవర్నర్.. నేరుగా భద్రాద్రి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంలోనూ కలెక్టర్, ఎస్పీ ఎవరూ హాజరుకాలేదు. ఆలయ ఈఓ శివాజీ మాత్రమే గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన తమిళిసై జిల్లా ఉన్నతాధికారులు ఎవరూ లేకుండానే మిథిలా మండపానికి వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారు. గవర్నర్ పర్యటనలో ఎక్కడా కలెక్టర్, ఎస్పీలు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అప్పటి గవర్నర్‌కు రాచమర్యాదలు: గతంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవానికి అప్పటి గవర్నర్ నరసింహన్ హాజరైన సమయంలో అధికారులంతా దగ్గరుండి ఆయన వెళ్లే వరకు అతిథి మర్యాదలు చేశారు. కానీ తమిళిసై తొలిసారిగా భద్రాద్రి వచ్చినప్పటికీ... జిల్లా ఉన్నతాధికారులు కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు ఇటీవల కొంత దూరం పెరిగిందంటూ వార్తలు రావడం, గవర్నర్‌పై మంత్రులు మూకుమ్మడి దాడి చేయటం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పర్యటనకు కలెక్టర్, ఎస్పీలు దూరంగా ఉన్నట్లు చర్చ జరిగింది. అయితే.. కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీఓ గౌతమ్ వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇవీ చూడండి:
ముల్లోకాలు మురిసేలా రాములోరి కల్యాణం... పులకించిన భద్రాద్రి
Governor in Bhadradri: భద్రాద్రిలో జగదభిరాముని పట్టాభిషేకం... హాజరైన గవర్నర్
Governor Tour: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ రెండ్రోజుల పర్యటన