నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి (R NARAYANAMURTHY) ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తెరకెక్కించిన 'రైతన్న' సినిమా ప్రమోషన్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆయన పర్యటించారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ క్యాంపు కార్యాలయంలో.. ఎమ్మెల్యే హరిప్రియ, ఏఎంసీ ఛైర్మన్ హరిసింగ్నాయక్, పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సహా పలువురు నేతలతో సమావేశమయ్యారు.
రైతుల కోసం తాను తీసిన చిత్రం విశేషాలు వెల్లడించి.. చిత్రంలోని ఒక పాటను పాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలతో అన్నదాతలకు (r narayana murthy on new agri laws) ఎటువంటి ఉపయోగం లేదన్నారు. కేవలం కార్పొరేట్ సంస్థలకు లబ్ధిచేకూర్చేందుకే సాగు చట్టాలను తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రైతులకు మధ్య యుద్ధం జరుగుతుందని... ప్రజలు ఎవరి వైపు ఉన్నారో చెప్పాలని ఆర్.నారాయణమూర్తి కోరారు.
ఒకప్పుడు 75 శాతం ఉన్న వ్యవసాయం 52 శాతానికి పడిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందులో 40 శాతం కరవు రైతులు ఉన్నారని.. వాళ్లంతా పంటను ఎక్కడైనా ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తే వీరి పరిస్థితి ఎంటని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రానిది మొండి పట్టుదల...
'36 ఏళ్లుగా నేను సినిమా తీస్తున్నా.. ఎప్పుడూ నా సినిమా చూడండి అని చెప్పలేదు. కానీ రైతన్న చిత్రం కోసం ప్రచారం చేస్తున్నా.. ఎందుకంటే.. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఎనిమిది నెలలుగా దిల్లీలో రైతులు.. మహోన్నతంగా పోరాటం చేస్తున్నారు. కేంద్రం మాత్రం సవరణలకు మాత్రమే అంగీకారం తెలుపుతోంది. భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద రైతుల ఉద్యమం మనం చూడలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండి పట్టుదలతో వ్యవహరిస్తోంది. చర్చల ద్వారా ఎంత పెద్దసమస్యకైనా పరిష్కారం చూపవచ్చని... చర్చిల్, అంబేడ్కర్..చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం రైతులతో 13 సార్లు చర్చలు జరిపినా.. ఎటువంటి పరిష్కారం చూపలేకపోయింది. ఇది చాలా దురదృష్టకరం.'
-ఆర్.నారాయణమూర్తి, నటుడు, దర్శకుడు
ఇదీచూడండి: BHARAT BANDH: ''భారత్ బంద్'ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ విజ్ఞప్తి.. తెతెదేపా మద్దతు'