భద్రాచలం పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా రెండు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. మొదటిది శ్రీరామనవమి, రెండవది ముక్కోటి ఏకాదశి. ఈ రెండు ఉత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. సీతారాములను దర్శించుకుని ఆనందంలో మునిగిపోతారు. ఇప్పుడా సీతారాముల కల్యాణ ఘడియలు దగ్గరపడ్డా సందడి లేదు. ప్రతి ఏడాది కల్యాణ మండపంలో చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల అలంకరణలు చేస్తారు. ఈసారి ఆ వైభవం లేక మండపం వెలవెలబోయింది.
కొవిడ్ కారణంగా
కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది సీతారాముల కల్యాణాన్ని మండపంలో భక్తులందరూ వీక్షించేలా కాకుండా.. కేవలం వీఐపీలు, ఆలయ అర్చకులతో నిర్వహించారు. ఈ ఏడాది కూడా భక్తులు లేకుండా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. గతంలో ఆలయం ఎదురుగా ఉన్నమిథిలా ప్రాంగణం ప్రతి ఏటా శ్రీరామ నవమి వచ్చిందంటే వేలాది మంది భక్తులతో కిటకిట లాడేది. శ్రీరామనవమికి 10 రోజులు ముందుగానే ఆలయంలో భక్తుల సందడి ఉండేది. వేలాది మంది భక్తులతో కళకళలాడాల్సిన మండపం నేడు బోసిపోయి దర్శనమిస్తోంది.
60 ఏళ్ల క్రితం
1960కి ముందు సీతారాముల కల్యాణాన్ని ఆలయం లోపల చిన్న మండపంలో నిర్వహించేవారు. ఆ తర్వాత వేలాది మంది భక్తులు తరలి రావడం వల్ల... 65 ఎకరాల్లో కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడు నుంచి ఏకశిలను తీసుకువచ్చి మండపం అందంగా చెక్కారు. మళ్లీ సుమారు 60 ఏళ్ల తర్వాత సీతారాముల కల్యాణం.. మిధిలా ప్రాంగణంలో కాకుండా ఆలయం లోపల నిర్వహించనున్నారు. కల్యాణ మహోత్సవాన్ని చూద్దామని ఆత్రుతతో ఉన్న భక్తులకు ఆలయం లోపల నిర్వహిస్తున్నారనే వార్తతో నిరుత్సాహం మిగిలింది.
ఇదీ చూడండి : తెలంగాణపై కొవిడ్ పంజా.. 39,154 యాక్టివ్ కేసులు