భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు చివరిరోజుకు చేరుకున్నాయి. నేడు స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా లక్ష్మణ సమేత సీతారాములను నిత్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, తేనె, నెయ్యి, పండ్లరసాలు, వివిధ రకాల నదీ జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు.
అనంతరం గోదావరి నది ఒడ్డున గల పునర్వసు మండపంలో నవకలశ స్నపనం జరగాల్సి ఉండగా ఉండగా లాక్డౌన్ కారణంగా చక్రస్నానం కార్యక్రమాన్ని ప్రధాన ఆలయంలోని నిత్యకల్యాణ మండపంలోనే నిర్వహించారు. గోదావరి జలాన్ని తీసుకువచ్చి గోదావరి నదీమాతను ఆవాహనం చేసి సుదర్శన చక్రానికి గోదావరి జలంతో స్నానం చేయించారు. యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమం, ఆ తర్వాత గరుడ పటాన్ని ధ్వజస్తంభం నుంచి దింపి ప్రత్యేక పూజలు, దేవతలందరికీ ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను అధికారికంగా నేటితో పరిసమాప్తమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు తెలిపారు.
ఏది ఏమైనప్పటికీ ఎంతో వైభవంగా జరగాల్సిన రామయ్య కల్యాణ వేడుకలు ఈ ఏడాది కరోనా కారణంగా భక్తలకు తీవ్ర నిరాశను మిగిల్చాయి.
ఇవీ చూడండి: 'యువతకు కరోనా రాదనుకుంటే పొరపాటే'