Sri Rama Navami in Bhadradri: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఏప్రిల్ రెండో తేదీ నుంచి 16 వరకు పదిహేను రోజుల పాటు.. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 10 న, మహా పట్టాభిషేకం వేడుకను 11వ తేదీన నిర్వహించనున్నారు.
అంగరంగ వైభవంగా కల్యాణం
కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా అంతరంగికంగా జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఈ ఏడాది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఈవో శివాజీ తెలిపారు. ఎప్పటిలాగే తిరువీధి సేవలు, స్వామివారి ఊరేగింపులు ఉంటాయని చెప్పారు. ముందుగానే ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తామని, భక్తులంతా విశేష సంఖ్యలో హాజరై సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: శ్రీవారి భక్తులకు 'సర్వదర్శన' కష్టాలు.. టోకెన్లు అందినా 4 రోజుల తర్వాతే దర్శనం