తండ్రే తనకు వ్యతిరేకంగా వ్యవహరించాడన్న మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది. తల్లిని కోల్పోయి నెలైనా కాకముందే తానూ బలవన్మరణానికి పాల్పడటంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నిండింది.
మండలంలోని నాగారం గ్రామానికి చెందిన ఐలపాక పవన్ కళ్యాణ్ (24)కు, సత్తుపల్లికి చెందిన రామకృష్ణవేణితో అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. పెళ్లైన ఏడాదికే మనస్పర్థలు రావడంతో రామకృష్ణవేణి బిడ్డతో పుట్టింటికి వెళ్లిపోయింది.
గత నెల 14న అత్త బుల్లెమ్మ(45) గుండెపోటుతో మరణించడంతో.. రామకృష్ణవేణి అంత్యక్రియలకు హాజరైంది. గొడవలు మర్చిపోయి హాయిగా జీవిద్దామని భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా అతడు వినకపోవడంతో మామ శ్రీను(భర్త తండ్రి)తో కలిసి ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. మీరైనా నచ్చజెప్పి తన కాపురాన్ని నిలబెట్టాలని వేడుకుని.. మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది.
తండ్రే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడన్న మనస్తాపంతో పవన్, గురువారం నాడు.. 'నా శవాన్ని నాన్న, భార్య ముట్టుకోవడానికి వీల్లేదంటూ' లేఖ రాసి ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాన్నమ్మ, తాతయ్యల చేతులమీదుగా అంత్యక్రియలు జరిపించాలనే మృతుడి కోరిక మేరకు.. దహన సంస్కారాలకు ఆ తండ్రి దూరంగా నిలిచాడు.
ఇదీ చదవండి: తండ్రి మరణాన్ని భరించలేక కూతురు ఆత్మహత్య.!