వర్షం వస్తే రైతన్న కంట కన్నీరే అన్నట్లుగా ఈ మధ్య కురిసిన వర్షాలు ఉన్నాయి. అకాల వర్షాలు కర్షకుల కంట కన్నీరు పెట్టిస్తుంది. పంటలకు అపార నష్టం కలుగజేసింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను అకాల వడగంళ్ల వాన రైతుల నెత్తిపై రాళ్లు రువ్వింది. పంటనంత నేలమట్టం చేసింది . ఈదురుగాలులతో కురిసిన వర్షం దెబ్బకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. చేతికొచ్చిన పంట మొత్తం నేలవాలిపోయింది. మరో 15రోజులైతే పంట ఇంటికొస్తదనే సమయంలో వర్షం తీవ్ర నష్టాన్ని కలిగించింది. మరి కొన్ని ప్రాంతాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న కల్లాలో మొత్తం నీరు చేరి పంట అంతా తడిచిపోయింది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కురిసిన అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 29.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 5 మండలాల్లో భారీ వర్షం, 15 మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సగటున 18 మిల్లీమీటర్లల వర్షపాతం నమోదైంది. 3 మండలాల్లో భారీ వర్షం, 14 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఈదురుగాలుల ప్రభావంతో మొక్కజొన్న, మామిడి, మిర్చి, బొప్పాయి పంటలు నేలవాలాయి.
ఈ సీజన్ లో ఖమ్మం జిల్లాలో 90 వేల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లోనూ 90 నుంచి 100రోజుల దశలో పంటలున్నాయి. మొక్కజొన్న ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. మొత్తం 120 రోజుల మొక్కజొన్న పంట మరో 20 రోజుల్లో చేతికి వచ్చేది. కానీ అకాల వర్షం పంటను నిండా ముంచేసింది. సాగర్ జలాలు సక్రమంగా అందటంతో ఈ ఏడాది మొక్కజొన్న ఏపుగా పెరిగి కంకులు బలంగా వచ్చాయి. కొన్నిప్రాంతాల్లో పంట కంకి దశలో ఉండగా.. మరికొన్నిచోట్ల విరుపుడు దశలో ఉంది.
అకాల వర్షంతో నష్టపోయిన పంటలను వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో సుమారు 18 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 53 ఎకరాల్లో పెసర పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. భద్రాద్రి జిల్లాలో 121 ఎకరాల్లో మొక్కజొన్న.. 10 ఎకరాల్లో బొప్పాయి పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
"మూడు ఎకరాలలో వేసిన మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రం దగ్గర పోశాము. వర్షం కురవడం వల్ల మొత్తం తడిసిపోయింది. గింజలు తడిసి మొత్తం నలుపెక్కింది. దీని వల్ల పంటకు మంచి ధర అనేది రాదు. ప్రస్తుతం రూ.2300 ఉన్న జొన్న ధర పంట తడవటంతో మరింత తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వమే పంటను కొనాలని కోరుకుంటున్నాం." అని రైతన్నలు తమ బాధను తెలియజేశారు. త్వరగా పంటనష్టాన్ని అంచనా వేసి, తమకు న్యాయం చేయాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి: