Revanth Reddy speech in Hath Se Hath Jodo Yatra : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో రెండోరోజు రేవంత్ పాదయాత్ర జోరుగా సాగింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీనాయకులు, వివిధ ప్రజాసంఘాలు, కార్మికసంఘాలతో రేవంత్ సమావేశమయ్యారు. రాజీవ్‌నగర్ తండా వాసులతో సమావేశమై... వారి సమస్యలపై చర్చించారు. సాయంత్రం రాజీవ్‌నగర్ నుంచి ఇల్లెందులోని జగదాంబ సెంటర్ వరకు 5 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు.
అనంతరం అక్కడే నిర్వహించిన సభలో పాల్గొన్న రేవంత్... భారాస సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో... దళిత, బీసీ, గిరిజన వర్గాలకు ఏమాత్రం న్యాయం జరగలేదని మండిపడ్డారు. ప్రభుత్వం దిగే సమయంలో పోడుభూములకు పట్టాలు పంపిణీ చేస్తామని.. మోసపూరిత మాటలు చెబుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇల్లెందు గడ్డ కాంగ్రెస్ అడ్డా అన్న రేవంత్ రెడ్డి.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే భర్త హరి దందాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణిలో దందా, ఇసుక, ఇటుక వ్యాపారంలో దందాలు చేస్తున్నారన్నారు. వరంగల్ డిక్లరేషన్ మేరకు రైతులకురుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇల్లెందు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర ముగిసింది. శనివారం రాత్రి అశ్వాపురం చేరుకొని అక్కడే బసచేశారు. నేడు విరామం ఇవ్వనున్న రేవంత్... రేపటి నుంచి పినపాక నియోజకవర్గంలో యాత్ర చేపట్టనున్నారు. ఈనెల 14 నుంచి 21 వరకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర సాగుతుందని పార్టీ నేతలు వెల్లడించారు. స్థానిక నేతలంతా సమావేశమై యాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
Revanth Reddy with Singareni workers: అంతకు ముందు సింగరేణి ఉపరితల గని ఆవరణలో కార్మికులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాల నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తమ శ్రమ దోపిడీకి గురవుతోందని.. సమాన పనికి సమాన వేతనం అమలు కావడంలేదని వారు విచారణ వ్యక్తం చేశారు. సమస్యలు విన్న రేవంత్.. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో ఉందని గుర్తుచేసిన ఆయన.. ఒకప్పుడు 70వేలు ఉన్న ఉద్యోగులు 40వేలకు తగ్గిపోయారని పేర్కొన్నారు. కమీషన్ల కక్కుర్తి కోసం ఓపెన్ కాస్ట్ గనులను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయొద్దని కాంగ్రెస్ తరపున పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశామని రేవంత్ గుర్తుచేశారు. సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రైవేట్‌కు అప్పగించి దోపీడికి పాల్పడుతున్నారని విమర్శించిన ఆయన.. గనులను కట్టబెట్టి రూ. 25వేల కోట్లు దోపీడికి పాల్పడాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Hathse Hath Jodo yatra: సింగరేణి సంస్థకు జెన్కో రూ.12 వేల కోట్ల బకాయి పడిందని పేర్కొన్నారు. ఇటువంటి పరిణామాలతోనే సింగరేణిలో కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.వీటన్నింటికి సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రధాన కారణమని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. క్రిమినల్ కేసులు ఉన్న అధికారి సీఎండీగా ఉండటానికి వీలేదని డిమాండ్ చేశారు. రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన అధికారి ఏళ్లు గడుస్తున్నా ఆ పదవిలో కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. యాత్రలో భాగంగా కార్మిక సంఘాల నేతలు వారి సమస్యలను వినతీ పత్రాల రూపంలో రేవంత్‌రెడ్డికి అందజేశారు.
"ఓపెన్ కాస్ట్ మైన్‌తో సింగరేణి కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తుంది. సింగరేణి కార్మికులు ఓట్లేసి గెలిపించి.. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు 70వేలు ఉన్న సింగరేణి ఉద్యోగులు 40వేలకు తగ్గిపోయారు. కమీషన్ల కక్కుర్తి కోసం ఓపెన్ కాస్ట్ గనులను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినాం.. అని చెప్పుకున్న వారికి రెండుసార్లు అధికారంలో ఉండే అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: