భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ఆళ్లపల్లి మండలంలోని మైలారం గ్రామ గిరి రైతుల వ్యవసాయ భూములు రాయిగూడెం పరిధిలో ఉన్నాయి. ఈ రెండు గ్రామాల మధ్య కిన్నెరసాని వాగు ప్రవహిస్తుంటుంది. దీనిపై వంతెన లేకపోవటం వల్ల రైతులు వాగులోనే నడుస్తూ, ఎడ్లబండ్లపై ప్రయాణిస్తూ పొలాలకు వెళ్తుంటారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వ్యవసాయ పనులుండటంతో గురువారం దాదాపు 30 మంది రైతులు ఎడ్లబండ్ల సాయంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుకుంటూ వెళ్లారు. సాయంత్రం తిరిగి మైలారం వచ్చారు. ప్రమాదకరమైనా తమకు ఇది తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో జల్లేరు, కోడెల, చింతపడి వాగులపై వంతెనలు లేకపోవటంతో రాయిగూడెం, చంద్రపురం, కర్నెగూడెం, పాతూరు, బోడాయికుంట, ఈదుళ్ల, అడవిరామరం, దొంగతోగు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నికల సమయంలో ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అంటూ హడావిడి చేసే నాయకులు ఆ తర్వాత తమ ముఖం కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెనలు లేక వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోతుంటాయని, అంబులెన్స్ రాలేని సందర్భంలో కాలినడకన వాగులు దాటే ప్రయత్నంలో కొంతమంది మృత్యువాత పడిన సందర్భాలున్నాయని తెలిపారు.