భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం కిచ్చెనపల్లి అటవీ ప్రాంతానికి దగ్గర్లో ఉండటం వల్ల రవాణా సౌకర్యం సరిగ్గా లేదు. గ్రామానికి చెందిన మోకాల శిరీష అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడం వల్ల కుటుంబ సభ్యులు ఆమెను ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్తూ సంజీవని వాహనానికి సమాచారం అందించారు.
సంజీవని దూరప్రాంతంలో ఉండటం వల్ల రావడానికి ఆలస్యమైంది. ఈలోపునే శిరీషకు పురిటి నొప్పులు ఎక్కువ కావడం వల్ల మార్గం మధ్యలోని మర్కోడు గ్రామ శివారులో రహదారి పక్కనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అనంతరం తల్లీబిడ్డను ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యురాలు సుజాత పరీక్షలు నిర్వహించి తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రసవం సమయంలో ఏఎన్ఎం సావిత్రి అందుబాటులో ఉండటం వల్ల గర్భిణీకి ప్రమాదం తప్పింది.
తమ గ్రామానికి రవాణా సదుపాయం లేక ఇలా ఎంతో మంది గర్భిణీలు వాహనాల్లో, రహదారి పక్కన ప్రమాదకర పరిస్థితుల్లో ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి: హేమంత్ సోరెన్‌కు కేసీఆర్,కేటీఆర్ శుభాకాంక్షలు