Kothagudem bandh: రేపు కొత్తగూడెం బంద్‌కు రాజకీయ పార్టీలు, వామపక్ష, విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని.. వనమా రాఘవను అరెస్టు చేసి రౌడీషీట్ తెరవాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెంలోని తూర్పుబజార్‌లో నివాసముంటున్న రామకృష్ణ... పాల్వంచలో మీ సేవా కేంద్రాన్ని నడిపారు. ఇటీవల ఇతరులకు లీజుకు ఇచ్చారు. అనంతరం రాజమహేంద్రవరానికి వెళ్లి రెండ్రోజుల క్రితం తిరిగి వచ్చారు. అనంతరం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దహనం కాగా.. చిన్న కుమార్తె తీవ్రగాయాలతో బయటపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆ చిన్నారి కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణ కారులో పలు పత్రాలు, బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరకడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్ పేరు ఉంది. అతనితో పాటు రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు కూడా ఉన్నాయి. వనమా రాఘవేందర్‌కు రామకృష్ణ అక్క మాధవికి వివాహేతర సంబంధం ఉందని... వారివల్ల తనకు అన్యాయం జరుగుతోందని అందుకే... ఆత్మహత్య చేసుకున్నట్లు రామకృష్ణ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
బయటికొచ్చిన మరో సంచలనం
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఇవాళ మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
సెల్పీ వీడియోలో..
‘"‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు" అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.
ఇదీ చదవండి:
Palvancha Family Suicide: 'నీ భార్యను హైదరాబాద్ తీసుకొస్తే.. నీ సమస్య తీరుతుంది'