పోడు భూమి లెక్క తప్పుతోంది. అటవీశాఖ అధికారులు చెబుతున్నదానికీ, క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తుల్లో పేర్కొన్న విస్తీర్ణానికి పొంతన కుదరడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న గిరిజనులు పోడు భూములకు హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. అటవీ, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులకు ఈ ప్రక్రియ బాధ్యతలను అప్పగించింది. జిల్లా కలెక్టర్లు హక్కుల జారీకి చర్యలు ప్రారంభించారు. గత నెలలో దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో అర్హులుకాని గిరిజనేతరుల దరఖాస్తులు అనేకం వచ్చినట్లు గుర్తించారు. గిరిజనుల పేరుతో వచ్చిన వాటిలో కూడా బినామీల దరఖాస్తులున్నట్లు సమాచారం. అటవీశాఖ వద్ద ఉన్న ఆక్రమణల జాబితాలు, దాఖలైన దరఖాస్తుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. అదనపు విస్తీర్ణం కోసం దాఖలైనవాటిలో అత్యధికం బినామీలవేనని అధికారులు భావిస్తున్నారు.
* ఖమ్మం జిల్లాలో అటవీ ఆక్రమణ 17,449 ఎకరాల్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతుండగా వచ్చిన దరఖాస్తుల్లో పేర్కొన్న విస్తీర్ణం 39 వేల ఎకరాలకు పైగా ఉంది.
* భద్రాద్రి జిల్లాలో పోడు వ్యవసాయంలో 2.29 లక్షల ఎకరాలున్నట్లు లెక్కలు ఉండగా దరఖాస్తుల్లో 2.89 లక్షల ఎకరాలకు హక్కులు కల్పించాలని కోరారు.
* సూర్యాపేట జిల్లాలో 20 వేల ఎకరాల అటవీ భూమికి 21వేల ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి.
* కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ లెక్కల ప్రకారం 1.05 లక్షల ఎకరాల ఆక్రమణలు ఉండగా 1.18 లక్షల ఎకరాలకు దరఖాస్తులు అందాయి.
* సంగారెడ్డి జిల్లాలో కూడా అటవీ ఆక్రమణలకు మించి దరఖాస్తులు దాఖలైనట్లు తెలిసింది.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం పోడు వ్యవసాయదారులకు హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2005కు ముందు సాగులో ఉన్న అటవీ ప్రాంతానికి పోడు హక్కులకు దరఖాస్తు చేసుకునేందుకు గిరిజనులకు అవకాశం కల్పించింది. గిరిజనేతరులైతే మూడు తరాలుగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్నట్లు ఆధారాలు సమర్పించాలనే నిబంధన విధించింది. రెవెన్యూ, అటవీశాఖల సరిహద్దు సమస్య ఉన్న జిల్లాల్లో పోడు హక్కుల దరఖాస్తులు వస్తే సరిహద్దు సర్వే చేసి స్పష్టత ఇవ్వాలని శాఖలు నిర్ణయించాయి. వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేసిన కమిటీలు పరిశీలించిన తర్వాత తుది జాబితాను రూపొందిస్తాయి.
కొట్టేయాలని చూస్తున్నారు
ప్రభుత్వం ఆదివాసి గిరిజనులకే పోడు హక్కులు కల్పించాలి. గిరిజనేతరులు కొందరు అక్రమంగా భూమిని కొట్టేయాలని చూస్తున్నారు. గిరిజనులను బినామీలుగా చేసుకుని చాలా జిల్లాల్లో దరఖాస్తులు పెట్టారు. గిరిజనుల అసైన్డ్ పట్టాలను కొనుగోలు చేసిన కొందరు ఆ భూములకు హక్కులు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి.- రమణాల లక్ష్మయ్య, ఆదివాసీ తుడుందెబ్బ జాతీయ కన్వీనర్
దరఖాస్తులు ఇలా..
* ఆదిలాబాద్ జిల్లాలో 77,818 ఎకరాల పోడు భూమికి 20,193 దరఖాస్తులు వచ్చాయి.
* నిర్మల్ జిల్లాలో 19,816 ఎకరాల భూమి కోసం 6,818 మంది దరఖాస్తు చేసుకున్నారు.