Flood Effect at Bhadrachalam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద విలయంతో ముంపు ప్రాంతాల ప్రజలు సర్వం కోల్పోయారు. వరద విపత్తుతో గూడు వదలి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లి తలదాచుకున్న బాధితులు గోదారమ్మ శాంతించడంతో ఇళ్లకు చేరుకుంటున్నారు. చెత్తా చెదారంతో నిండిపోయి ముక్కుపుటాలదిరే దుర్వాసనతో ఉన్న నివాసాలు బాధితులకు స్వాగతం పలుకుతున్నాయి. ఆనవాళ్లు కోల్పోయి, బురదమయమై దర్శనమిస్తున్న ఇళ్లను చూసి వారు బోరుమంటున్నారు.
ఇళ్లల్లో విలువైన గృహోపకరణాలు, ఇతర సామాగ్రి, నిత్యవసరాలు వరదల ధాటికి సర్వనాశమైపోయాయి. బియ్యం నుంచీ పడుకునే మంచం వరకూ అన్నీ వరదపాలవడంతో దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు అలమటిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. గ్రామానికో దయనీయత, ఇంటింటికో కన్నీటి వ్యథే ముంపు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. గోదావరి వరదల ధాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండాల్లోని 7వేల 500 కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీశాయి.
వందలాది గ్రామాలు రోజుల తరబడి వరదల్లో మునిగిపోగా 27వేల మంది మంది బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వారం రోజులుగా బాధితుల ఇళ్లన్నీ వరద నీటిలోనే నానిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే వరదలు తగ్గుముఖం పడుతుండటంతో... పునరావాస కేంద్రాల్ల్లో తలదాచుకుంటూనే బాధితులు ఇళ్లు చూసుకునేందుకు వరుస కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముంపు బాధిత గ్రామాల్లో అన్నీ దయనీయ దృశ్యాలే బాధితులకు కనిపిస్తున్నాయి. అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి నష్టాన్ని అంచనావేసి తమను ఆదుకోవాలని ముంపు బాధితులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: Puvvada on AP Ministers: జగన్‌తో చర్చించి ఐదు గ్రామాలు ఇప్పించలేరా?: పువ్వాడ అజయ్
అగ్నిపథ్‌కు 'కులం' చిచ్చు!.. 'ఆ లెక్కల ప్రకారం నియామకాలు'.. రాజ్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్