భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం జిన్నెలగూడెంలో రాతియుగం నాటి సమాధుల ఆనవాళ్లను, రాతి చిప్పలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. గ్రామంలోని ఓ రైతు పొలం దున్నుతున్న సమయంలో రాతిచిప్పలు బయటపడ్డాయి. వాటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు గొగ్గల శంకర్ పరిశీలించారు.

రాతి చిప్పలతో పాటు పొలాల పక్కన పరుపు రాతి బండలపై తొలిచిన నీటి తొట్లున్నాయని బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదిమ మానవులు ఈ రాతి తొట్లను నీటి నిల్వకు, చిప్పల్ని నీరు తాగడానికి వాడి ఉంటారని వాటి చిత్రాల్ని పరిశీలించిన తెలంగాణ వారసత్వ శాఖ అధికారిగా పనిచేసిన భానుమూర్తి అభిప్రాయపడ్డారని ఆయన పేర్కొన్నారు.
