Paddy Grain Procurement: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలో ఈసారి 2.80 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 221 కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. 154 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి.
ధాన్యం ఆలస్యంగా చేతికొస్తోంది: రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం ఆలస్యంగా చేతికొస్తోంది. దీంతో కొనుగోళ్లు ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. ఈసారి సన్నరకాలకు బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉండటంతో.. ప్రైవేట్ వ్యాపారులు రంగంలోకి దిగి భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 132 కేంద్రాల్లో 5,160 మంది రైతుల నుంచి.. 31వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సేకరించిన దాంట్లో 26,787 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకు తరలించారు.
రైతుల్లో కొంత ఆందోళన: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 కేంద్రాల్లో 931 మంది రైతుల నుంచి 6056 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 6000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు. ఇప్పటికే చాలామంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించడంతో.. కేంద్రాలకు ధాన్యం తక్కువగా వస్తోంది. మూడ్రోజులుగా తుపాను ప్రభావం, వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో.. రైతుల్లో కొంత ఆందోళనకు గురవుతున్నారు.
త్వరితగతిన చెల్లింపులు చేయాలి: టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసిపోతుందేమోనని భయపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 5160 మంది రైతులు ధాన్యం విక్రయించారు. వీరికి మొత్తం ధాన్యం సొమ్ము రూ.27.74 కోట్లు అందించాల్సి ఉంది. ఇందులో 686 మంది రైతులకు.. రూ.8.44 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 4,474 మందికి సుమారు రూ.19 కోట్లకుపైగా ధాన్యం సొమ్ము అందాల్సి ఉంది. భద్రాద్రి జిల్లాలో 931 మంది రైతులకు రూ.12.42 కోట్ల ధాన్యం సొమ్ము అందాల్సి ఉండగా ఇప్పటివరకు 556 మందికి రూ.7.42 కోట్ల మేర చెల్లింపులు చేశారు.
మిగిలిన 441 మంది రైతులకు రూ.4. 67 కోట్లు చెల్లించాల్సి ఉంది. వారంలోనే చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. రైతుల వివరాలు ట్యాబ్ ఎంట్రీ, ట్రక్ షీట్ నమోదు, మిల్లుల వద్ద పెండింగ్‌లో ఉండటం వల్ల.. ధాన్యం సొమ్ము ఖాతాల్లో జమ కావడం ఆలస్యమవుతోంది. ఉన్నతాధికారులు చొరవచూపి త్వరితగతిన చెల్లింపులు చేయాలని రైతులు కోరుతున్నారు.
"ఈ సారి కొనుగోళ్ల కేంద్రంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి అవసరమైన వసతులను ఏర్పాటు చేశాం. తద్వారా ధాన్యం కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. రైతులు నష్టపోకుండా మిల్లరు కేంద్రాలే కానీ ధాన్యంలో తాళ్లు లేకుండా చర్యలు తీసుకున్నాం. రైతులకు త్వరితగతిన చెల్లింపులు చేశాం." - మధుసూదన్, ఖమ్మం అదనపు కలెక్టర్
ఇవీ చదవండి: 'బీజేపీకు దడ పుట్టిస్తాం.. భవిష్యత్తులో బీజేపీకి మరిన్ని కష్టాలు'
మూడు ఎన్నికల ఫలితాలు.. పార్టీలకు ఎన్నో పాఠాలు.. '2024'పై ప్రభావమెంత?